కారు పీఠమెక్కితే... మంత్రులు మారతారా...!

Mon Dec 10 2018 07:00:01 GMT+0530 (IST)

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అన్నీ సంచలనంగానే ఉన్నాయి. ఎన్నికలకు ముందే కాదు... ఫలితాల తర్వాత కూడా సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలు నువ్వా..నేనా అన్న రీతిలో జరగడమే ఇందుకు కారణంగా కనిపిప్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో కొందరు మంత్రులు ఓటమి పాలవుతారని అంటున్నారు. దీనికి కారణం వారిపై నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకతే అని వార్తలు వస్తున్నాయి.ప్రతి ఎన్నికల్లోనూ మంత్రులు కొందరు సీనియర్ నాయకులు ఓటమి పాలు కావడం దేశంలో జరుగుతూనే ఉంటుంది. ఇది ఆ ఎన్నికల వరకూ సంచలనం కూడా. దీనికి ఆ పార్టీ... ఈ పార్టీ అని లేదు. దేశంలోని అన్ని పార్టీలకు చెందిన సీనియర్లు ఓటమి పాలు కావడం రివాజుగా వస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి చెందని వారిలో కొందరు సీనియర్ నాయకులు - మంత్రులు ఓటమి పాలు కావడం ఇంతకు ముందు చాలా సార్లు జరిగింది.ఈపారి కూడా ఇదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అంటున్నారు.

ఒకవేళ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు మంత్రుల ఓటమి పాలైతే.... అలాగే మరికొందరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మంత్రులు కొందరు మారడం ఖాయంగానే కనిపిస్తోందంటున్నారు. ఇంతకు ముందు క్యాబినెట్ లో ఉన్న వారిలో చాలా మందిని కేవలం ఎమ్మెల్యేలుగానూ - కొత్త వారిని కొందరిని మంత్రులుగాను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

దీనికి కారణం సులభంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో చాలా మందిపై వ్యతిరేకత ఉన్నా వారికి టిక్కట్లు ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తీరా ఎన్నికల సమయంలో వారిపై ఉన్న వ్యతిరేకత ఊహించనంతగా బయటపడింది. దీంతో రేపు అధికారంలోకి వస్తే వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దీనిని అనుసరించే ఈ సారి మంత్రివర్గంలోకి సీనియర్లను కాకుండా కొత్తవారిని తీసుకోవాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా వయసు మీరిన వారిని కాకుండా యువకులకు ఈసారి అవకాశం ఇవ్వాలని కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారితెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే మాత్రం మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వాలని కూడా పార్టీ అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు.