Begin typing your search above and press return to search.

పాత మంత్రుల‌కు మ‌ళ్లీ స్థానం మిథ్యేనా?

By:  Tupaki Desk   |   16 Dec 2018 2:30 PM GMT
పాత మంత్రుల‌కు మ‌ళ్లీ స్థానం మిథ్యేనా?
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సారి ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌నున్నారు ? అస‌లు మంత్రుల ప్ర‌మాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది ? ఏ శాఖ‌లు ఎవ‌రికి అప్ప‌గిస్తారు ? తెలంగాణ అంత‌టా ఎక్క‌డ న‌లుగురు క‌లిసినా ఇప్పుడు ఇదే చ‌ర్చ‌. అయితే అనూహ్యంగా ఒక విష‌యం మీడియా స‌ర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసిన కొంద‌రికి ఈ సారి కేసీఆర్ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఉద్య‌మంలో వెంట‌న‌డిచార‌ని మంత్రి ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించినా ఆయా శాఖ‌ల ప‌రంగా వారు త‌మ‌ద‌యిన కొత్త‌ద‌నాన్ని ఏమీ చూయించ‌లేక‌పోయార‌ని - నాలుగున్న‌రేళ్ల‌లో వారి వారి శాఖ‌ల మీద క‌నీసం ప‌ట్టు తెచ్చుకోలేక‌పోయార‌ని - కేసీఆరే అన్నీ తానై త‌న మంత్రివ‌ర్గంలోని స‌హ‌చ‌రుల‌కు చెడ్డ‌ పేరు రాకుండా చూసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తుంది. రెండోసారి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టిన నేప‌థ్యంలో ఈ సారి కూడా పాత‌ వారికే అవ‌కాశం ఇస్తే ఖ‌చ్చితంగా పార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది.

ప్రాజెక్టుల నిర్మాణం గానీ - రైతుబంధు - రైతుభీమా గానీ - క‌ళ్యాణ‌ల‌క్ష్మి - షాదీముబార‌క్ ప‌థ‌కం కానీ - మిష‌న్ భ‌గీర‌ధ ప‌థ‌కం కానీ - అమ్మ‌వ‌డి - కేసీఆర్ కిట్ ప‌థ‌కం కానీ - కంటివెలుగు కార్య‌క్ర‌మం గానీ అన్నీ కేసీఆర్ ఆలోచ‌న‌ల నుండి పుట్టి - ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు అమ‌ల‌వుతున్న‌వే. హ‌రీష్ రావును మిన‌హాయిస్తే మిగిలిన శాఖ‌ల మంత్రులు ఆయా ప‌థ‌కాల అమ‌లు మూలంగా ప్ర‌భుత్వానికి మ‌రింత పేరు తెచ్చేందుకు చేసిన కృషి ఏమీ క‌నిపించ‌దు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి శాఖ‌లు ఊడ‌తాయి ? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి స‌హా గ‌తంలో ప‌నిచేసిన‌ న‌లుగురు మంత్రులు ఈసారి ఓడిపోయారు. మ‌ధుసూద‌నాచారి కొడుకు మూలంగా ఓడిపోగా - తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్థానికేత‌రుడు - పార్టీలో విభేధాలు ఆయ‌న కొంప‌ముంచాయి. జూప‌ల్లి కృష్ణారావు ఐదుసార్లు విజ‌యం సాధించి ఆరోసారి కీల‌క స‌మ‌యంలో ఓడిపోయాడు. ఆయ‌న ప‌నుల‌ కోసం వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే ప‌రాజ‌యానికి కార‌ణంగా తెలుస్తుంది. చందులాల్ అనారోగ్యం కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం ఓట‌మికి దారితీసింది. ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తీరు ప‌ట్ల విసుగుచెంది సొంత పార్టీ నేత‌లే ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. ఏది ఏమ‌యినా తుది నిర్ణ‌యం కేసీఆర్ దే. ఆయ‌న ఎవ‌రికి చెక్ పెడ‌తారు ? ఎవ‌రిని అంద‌లం ఎక్కిస్తారు ? అన్న‌ది వేచిచూడాలి.