Begin typing your search above and press return to search.

జానాను నెత్తిన పెట్టుకుంటున్న గులాబీ సెలెబ్స్‌

By:  Tupaki Desk   |   27 Aug 2016 7:16 AM GMT
జానాను నెత్తిన పెట్టుకుంటున్న గులాబీ సెలెబ్స్‌
X
తెలంగాణ రాష్ట్ర సమితి వారందరికీ ఇప్పుడు జానారెడ్డి చాలా ప్రియమైన నాయకుడు అయిపోయాడు. జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభలో ఫ్లోర్‌ లీడరు కావొచ్చు గాక.. కానీ గులాబీ పార్టీ పెద్దలు నాయకులంతా.. ఆయనను తాజాగా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన చెప్పిన మాటలు గమనించండి చాలు.. తతిమ్మా కాంగ్రెస్‌ నాయకుల మాటలు పట్టించుకోవద్దు.. అంటూ తమ శీలాన్ని నిరూపించుకోవడానికి వాడుకుంటున్నారు.

గోదావరిపై ప్రాజెక్టులు కట్టే విషయంలో మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలను చారిత్రాత్మకమైనవిగా తెరాస బీభత్సంగా ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఇవన్నీ చీకటి ఒప్పందాలని - తెలంగాణకు శాశ్వత కీడు జరుగుతుందని, కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలు వాదిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో.. జానారెడ్డి కూడా తమ పార్టీ తరఫున మీడియా ముందుకు వచ్చి... సెల్ఫ్‌ గోల్‌ వేశారు. తమ్మిడిహట్టి వద్ద 152 అడుగుల ఎత్తుతో కట్టడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే - తెరాస 149కే ఒప్పందం చేసుకుని ద్రోహం చేసిందనేది ఆరోపణ. అప్పట్లో తాము ఒప్పందం కూడా చేసుకున్నాం అంటూ కాంగ్రెస్‌ వారు వాదిస్తున్నారు. అయితే జానారెడ్డి తన ప్రెస్‌ మీట్‌ లో అప్పట్లో చర్చలు జరుగుతూ ఉండగా - కొలిక్కి రాలేదని - ఇప్పుడు ప్రభుత్వం మేం చేసిన ప్రయత్నం ప్రకారం 152 అడుగుల ఒప్పందం చేసుకోకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఆయన తెరాసను తిట్టాలనే అనుకున్నారు గానీ.. వాస్తవానికి వారి చేతికి మంచి అస్త్రం అందించారు.

అసలు తమ్మిడిహట్టిపై కాంగ్రెస్‌ ఒప్పందంచేసుకోలేదని - జానా నిజం చెబుతున్నారని - తతిమ్మా కాంగ్రెస్‌ వాళ్లంతా మభ్యపెడుతున్నారని ఇప్పుడు తెరాస నేతలు జానా మాటలనే వాడుకుంటున్నారు. జానారెడ్డి చాలా పెద్ద మనిషి అని - ఆయన నిజాయితీగా నిజాలు ఒప్పుకున్నారని, కాంగ్రెసువాళ్లు ఆయనను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. తెరాస ప్రముఖుల్లో కేటీఆర్‌ - కవిత - ఇంకా ఈ మహా ఒప్పందాల గురించి మాట్లాడుతున్న మంత్రులంతా కూడా ఇదే వాదనతో ఉన్నారు. అందరూ జానాను నెత్తిన పెట్టుకుంటున్నారు.

ఇండైరక్టుగా తెరాస సర్కారుకు మేలు చేయడం జానారెడ్డికి ఇవాళ కొత్త కాదు. ఆయన తెరాసలో చేరిపోతాడని పుకార్లు వచ్చే రేంజిలో ఆయన వారికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. గతంలో వారి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ ను సమర్థించిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. మరి ఈసారి ఇలా వారికి ఉపయోగపడుతున్నారు.