Begin typing your search above and press return to search.

కారు పార్టీ కేసీఆర్ కంట్రోల్ త‌ప్పుతోందా?

By:  Tupaki Desk   |   14 Jan 2018 1:03 PM GMT
కారు పార్టీ కేసీఆర్ కంట్రోల్ త‌ప్పుతోందా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆ పార్టీ నేత‌ల్లో అసంతృప్తి నెల‌కొందా? పార్టీని ఏక‌చ‌త్రాధిప‌త్యంగా న‌డిపిస్తున్న‌ప్ప‌టికీ... కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలను గులాబీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారా? అందుకే త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారా? టీఆర్‌ఎస్‌ నేతలు స్వరం పెంచుతున్న తీరు చూస్తుంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సీనియ‌ర్లు మొద‌లుకొని ఎమ్మెల్యేల వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా తప్పుపడుతున్న తీరు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రెండురోజులక్రితం హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను తిట్టిన ముండాకొడుకులే... ఇవాళ తెలంగాణ క్యాబినెట్‌లో కులుకుతున్నారు అని నాయిని మాట్లాడారు. ఆ మ‌రుస‌టి రోజే మర్రి చెన్నారెడ్డి జయంతి కార్యక్రమంలోనూ ఆయనను ఆకాశానికెత్తేశారు. చెన్నారెడ్డి స్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ కోసం పోరాడారని చెప్పడం విశేషం. తెలంగాణలో మగాడంటే మర్రి చెన్నారెడ్డే అని కొనియాడారు. నాయిని సొంత పార్టీ నేతలపైనే తిట్ల పురాణం అందుకుంటే, ఆ తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మద్దతుగా నిలిచారు. ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రి వర్గంలో ఉన్నమాట వాస్తవమేనని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అయితే ఈ కామెంట్లు కాకతీయళంగా వ‌చ్చిన‌వి కాదని కొంద‌రు అంటున్నారు.

కేసీఆర్ విధానాలే ఈ అసంతృప్తుల‌కు బీజం వేశాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పునరేకీకరణ జరగాలని, అన్ని పార్టీల్లో ఉన్న నేతలు టీఆర్‌ఎస్‌పార్టీలో కలిసిపోవాలని చేసిన పిలుపే కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి స్థానిక నేతలు ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నా, పెద్దగా వాటిని కేసీఆర్‌ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌పార్టీలో చేరిన నేతలతో మొదట్నుంచి ఉన్న నేతలకు పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు రావన్న భయం వారిని వెంటాడుతున్నది. నియోజకవర్గాల సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో 30 నుంచి 40 మంది సిట్టింగులను తప్పిస్తారన్న ప్రచారం జోరందుకున్నది. చాలాచోట్ల ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమన్వయం లేదు. నిజామాబాద్‌ రూరల్‌, మునుగోడు వంటి చోట్ల విభేదాలు రచ్చకెక్కాయి. అయితే, కొంతమందికి నామినేటెడ్‌ పదవులు, మరికొందరికి పార్టీ పదవులు కట్టబెట్టి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఎక్కడో చోట టీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఒకరిద్దరు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే తీగల కృష్షారెడ్డి ఏకంగా ఉద్య‌మ‌కారుల‌పై తిట్లదండకం అందుకున్న ఉదంత క‌ల‌క‌లం రేపింది.

మరోవైపు వ‌చ్చే ఎన్నిక‌లు సైతం టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిని పెల్లుబుకేలా చేస్తోంద‌ని అంటున్నారు. మరికొన్నిచోట్ల సిట్టింగులను తప్పించి ఎంపీలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల ఇవ్వడానికి కేసీఆర్‌ సిద్ధమయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ రూరల్‌లో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు వేయాలని సీఎం కేసీఆర్‌కు ఆ జిల్లా ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందించారు. అది పెండింగ్‌లో ఉండగానే మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తుండడం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌పార్టీని కలవరపెట్టిస్తున్నది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ గతంలో గులాబీ బాస్‌ చేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. స్థూలంగా కేసీఆర్‌ నుండి కారు స్టీరింగ్‌ అదుపుతప్పిందా అన్న ప్రచారం జరుగుతోంది.