Begin typing your search above and press return to search.

ఇప్పుడు మిగిలిన ‘‘టీ’’ తమ్ముళ్లు ఎంతమంది?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:06 AM GMT
ఇప్పుడు మిగిలిన ‘‘టీ’’ తమ్ముళ్లు ఎంతమంది?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తెలంగాణ అధికారపక్షానికి ఇంతకాలం కంట్లో నలకలా ఉన్న విపక్షం ఇప్పుడు ఏకంగా ఉనికి కోల్పోయే ప్రమాదం అంచున నిలబడింది. సార్వత్రిక ఎన్నికల్లో టీటీడీపీ తరఫు నుంచి 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని అప్పుడొకరు.. అప్పుడొకరుగా పార్టీ మారటం తెలిసిందే.

తాజాగా ఆ పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేతే పార్టీ మారిపోవటం ఇప్పుడు టీటీడీపీకి షాకింగ్ గా మారింది. తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనలో పాలు పంచుకున్న ఎర్రబెల్లి దయాకర్ తన సుదీర్ఘ సైకిల్ యాత్రను ముగించి.. కారెక్కి దూసుకోవాలని భావించటం తెలంగాణ తెలుగుదేశానికి కొత్త తిప్పలు తీసుకురావటం ఖాయం.

ఇక.. ఎన్నికల్లో గెలిచిన 15 మంది టీటీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్క మంగళ.. బుధవారాల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు మెడలో వేయించుకొని పార్టీ బాస్ కు షాక్ ఇవ్వటం తెలిసిందే. మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ చేరగా.. బుధవారం రాత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. తాజాగా చోటు చేసుకున్న జంపింగ్స్ తో.. తెలంగాణ అధికారపక్షంలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు తొమ్మిదికి చేరింది. మిగిలిన ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలోకి చెందిన వారు కావటం గమనార్హం.

నగరానికి చెందిన మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్).. అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి).. కృష్ణయ్య (ఎల్ బీనగర్).. కాగా.. రేవంత్ రెడ్డి (కొడంగల్).. ఎస్. రాజేంద్రర్ రెడ్డి (నారాయణ్ పేట).. సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) ఉన్నారు. ఈ ఆరుగురిలో మరో ఇద్దరు లేదంటే ముగ్గురు అధికారపార్టీ తీర్థం తీసుకుంటారని.. దీంతో.. టీటీడీపీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం ముగుస్తుందని చెబుతున్నారు.

తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందుకు భిన్నంగా ఉనికి కోసం పోరాడే దుస్థితికి దిగజారిన వైనాన్ని చూస్తే.. కాలమహిమ ఎలా ఉంటుంది ఇట్టే అర్థమవుతుంది.