Begin typing your search above and press return to search.

కేసీఆర్ దెబ్బ‌కు ఎమ్మెల్యేలు అటువైపే చూడ‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   27 July 2017 7:35 AM GMT
కేసీఆర్ దెబ్బ‌కు ఎమ్మెల్యేలు అటువైపే చూడ‌ట్లేద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కు ఆ పార్టీలో ఎంత ప‌ట్టుందో తెలియ‌జెప్పేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు. ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న రాజ‌య్య‌ను ఎలాంటి కార‌ణాలు లేకుండా అక‌స్మాత్తుగా తొల‌గించ‌డం ఇందుకు మ‌చ్చుతున‌క‌గా చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ విష‌యంలో కేసీఆర్ ఉగ్ర‌రూపం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కలెక్టర్‌ తో అసభ్యంగా ప్రవర్తించిన శంకర్‌ నాయక్‌ వ్యవహారంపై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించడం - కలెక్టర్‌ కు క్షమాపణలు చెప్పాలని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంతో తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ నాయకులు త‌మ దూకుడును కాదుక‌దా క‌నీసం స‌హ‌జ‌శైలిని కూడా ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి శంకర్‌ నాయక్‌ ఎపిసోడ్‌ కు ముందు మంత్రులు - ఎమ్మెల్యేలు ఏం పని చెప్పినా కలెక్టర్‌ తోపాటు ఇతర అధికారులు చేసేవారు. ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను నేరుగా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కాని ఇప్పుడా పరిస్థితులు లేకుండా పోయాయని కొంతమంది టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సమస్య గురించి పలుమార్లు కలెక్టర్లకు చెప్పినా పనులు చేయడంలేదంటున్నారు. గట్టిగా వారిని హెచ్చరించాలని ఉన్నా... శంకర్‌ నాయక్‌ ఎపిసోడ్‌ కళ్లముందు కదులుతుందంటున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తే అది తిరిగి తమకే రివర్స్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకే కలెక్టర్ల - ఇతర అధికారులను గట్టిగా హెచ్చరించలేక సైలెంట్‌ గా ఉండాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనుల్లో కొంద‌రు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా... వారిని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నార‌ని జోరుగా చ‌ర్చ సాగుతోంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా సైలెంట్‌ అయిపోతున్నారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని కొంద‌రు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అధికారులు జవాబుదారీతనంగా వ్యవహరించకపోతే ప్రజల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. అధికారులు తమ మాట వినడంలేదన్న భావనలో ఉన్న పార్టీ నేత‌ల స‌మ‌స్య‌ను గులాబీ బాస్‌ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలని అంటున్నారు.