Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వ‌ర్సెస్ క‌లెక్ట‌ర్..ఇంకో మ‌లుపు

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:23 AM GMT
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వ‌ర్సెస్ క‌లెక్ట‌ర్..ఇంకో మ‌లుపు
X
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన మ‌ధ్య మొద‌లైన వివాదం మ‌లుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యే చెరువును క‌బ్జా చేశాడంటూ మీడియా సాక్షిగా క‌లెక్టర్ మండిప‌డిన నేప‌థ్యం రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. క‌లెక్ట‌ర్‌-ఎమ్మెల్యేల మ‌ధ్య ఉన్న గ్యాప్ వ‌ల్ల ఈ వివాదం ర‌చ్చ‌కు ఎక్కింద‌ని కూడా వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే క‌లెక్ట‌ర్‌ కామెంట్ల నేప‌థ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఎస్.పి సింగ్ క‌లిసి జనగామ కలెక్టర్ శ్రీదేవసేన పై ఫిర్యాదు చేశారు. అనంత‌రం స‌చివాల‌యంలోని మీడియాపాయింట్‌లో ముత్తిరెడ్డి మాట్లాడుతూ త‌న‌పై అనవసర ఆరోపణలు చేసిన కలెక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను - రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్ కోరుతున్నాన‌ని చెప్పారు.

అయితే తాజాగా ఈ వివాదం మ‌రో మ‌లుపు తిరిగింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు నేప‌థ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనపై ఫిర్యాదుపై ప్రభుత్వం నుంచి అసెంబ్లీ కార్యదర్శి క్లారిఫికేషన్ అడిగారు. మంగ‌ళ‌ - బుధ‌వారాల్లో కలెక్టర్ దేవసేన సెక్రటేరియట్ కు వచ్చారు. సీబ్లాక్ లో కలెక్టర్ దేవసేన అధికారులను కలిశారు. ఈ సంద‌ర్భంగా తాను అక్ర‌మాల‌పై మాత్ర‌మే స్పందించినట్లు వివ‌ర‌ణ ఇచ్చారు. క‌లెక్ట‌ర్ దేవ‌సేన వివ‌ర‌ణ‌ను నోట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

కాగా, గ‌తంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన‌పైన వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత త‌న‌పై ఉందని అన్నారు. 2000 గజాల స్థలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అని జనగామ కలెక్టర్ అన్న మాట అవాస్తవం, అర్ధరహితమ‌ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పారు. త‌న పేరు మీద ఒక్క గజం జాగా అయినా రిజిస్ట్రేషన్ అయి ఉంటే.... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తాను రెడీ అని స‌వాల్ విసిరారు. క‌లెక్ట‌ర‌మ్మ చెప్తున్నది టెంపుల్ ట్రస్ట్ భూమి అని పేర్కొంటూ దానికి చైర్మన్ గా ఎమ్మెల్యే ఉంటాడని శాస‌న‌స‌భ్యులు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి వివ‌రించారు. గతంలోను త‌న‌కు, కలెక్టర్ కి మధ్య ఫోన్ కాల్ విషయంలో చిన్న గందరగోళం ఏర్పడిందని తెలిపారు.