Begin typing your search above and press return to search.

కారు ఓట్ల‌లో40 శాతం కూడా విప‌క్షాల‌కు రావ‌ట్లే!

By:  Tupaki Desk   |   24 Nov 2015 5:25 AM GMT
కారు ఓట్ల‌లో40 శాతం కూడా విప‌క్షాల‌కు రావ‌ట్లే!
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ జోరు ఓ రేంజ్ లో సాగుతోంది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ను ఒక మంత్రికి అప్ప‌జెప్పిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాం బ్ర‌హ్మండంగా వ‌ర్క్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు చూస్తుంటే.. 2014 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ స్థానానికి వ‌చ్చిన మెజార్టీ కంటే భారీ మెజార్టీ వ‌స్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప‌సునూరి ద‌యాక‌ర్ కు వ‌చ్చిన మొత్తం ఓట్ల‌లో విప‌క్షాల‌న్నింటికి క‌లిపి 40 శాతం ఓట్లు కూడా రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. విప‌క్షాలు పోటాపోటీగా ప్ర‌చారం చేసిన నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి మెజార్టీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి తాజా ఫ‌లితాలు చూస్తుంటే క‌నిపిస్తోంది.

ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యానికి టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి 1.53ల‌క్ష‌ల ఓట్లు వ‌స్తే.. విప‌క్షాలైన కాంగ్రెస్ కు 30వేలు.. బీజేపీ.. టీడీపీ అభ్య‌ర్థికి 26వేలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 2500 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి వ‌చ్చిన 1.53ల‌క్ష‌ల ఓట్ల‌లో 40 శాతం ఓట్లు అంటే.. సుమారు 61 వేల ఓట్లుగా ఉంటాయి. విప‌క్షాలు మూడింటికి క‌లిపినా కూడా రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ గ‌ణాంకాల్ని చూస్తే.. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక మొత్తం ఏక‌ప‌క్షంగా సాగిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఇదే తీరులో కారు జోరు సాగితే.. ఓట్ల లెక్కింపు పూర్త‌య్యేనాటికి అధికార‌.. విప‌క్షాల‌ న‌డుమ భారీ వ్య‌త్యాసం ఉండ‌టం ఖాయమ‌నిపిస్తోంది.