Begin typing your search above and press return to search.

సార్ క‌రెక్టేనా?.. గులాబీ బ్యాచ్ లో కొత్త చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   15 Aug 2018 5:52 AM GMT
సార్ క‌రెక్టేనా?.. గులాబీ బ్యాచ్ లో కొత్త చ‌ర్చ‌!
X
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాటే శాస‌నం అన్న‌ట్లు ప‌రిస్థితి ఉంది. కానీ.. సిత్రంగా ఇలాంటి ప‌రిస్థితే ఉండాల్సిన టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇందుకు భిన్న‌మైన సీన్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. కాకుంటే.. ఇదంతా పైకి కాద‌ని.. పార్టీ అంత‌ర్గ‌తంగా ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

అన‌వ‌స‌ర‌మైన క‌న్ఫ్యూజ‌న్ కు తెర దించుతూ గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో తాము సాధించిన ప్ర‌గ‌తిని చెప్ప‌ట‌మే కాదు.. సెప్టెంబ‌రు మొద‌ట్లో భారీ బ‌హిరంగ స‌భ‌.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టిస్తామంటూ కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎంత సంచ‌ల‌నంగా మారిందో.. టీఆర్ ఎస్ పార్టీలో అంత‌కు రెట్టింపు హాట్ టాపిక్ గా మారింది.

షెడ్యూల్ కంటే ఐదారు నెల‌ల ముందే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్ మాట‌ల‌పై పార్టీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. సార్ తీసుకున్న నిర్ణ‌యం మంచిదేనంటావా? అన్న సందేహం ప‌లువురు మ‌ధ్య చ‌ర్చల రూపంలో న‌డుస్తోంది. అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్ని వేర్వేరుగా ఎదుర్కోవాల‌న్నట్లు ఉన్న కేసీఆర్ ఆలోచ‌న‌పై గులాబీ బ్యాచ్ లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌టం విశేషం.

కేవ‌లం మూడు.. నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండు పెద్ద ఎన్నిక‌ల్ని ఎదుర్కోవటం స‌రికాద‌న్న మాట‌ను ఎక్కువ మంది టీఆర్ఎస్ నేత‌ల మాట‌ల్లో వినిపించ‌టం గ‌మ‌నార్హం. అయితే.. కేసీఆర్ సారు స‌మ‌ర్థ‌త‌పైనా.. ఆయ‌న దూర‌దృష్టి మీద న‌మ్మ‌కం ఉన్న గులాబీబ్యాచ్.. సార్ ఆలోచించ‌కుండా నిర్ణ‌యం తీసుకుంటారా? పార్టీకి మంచి జ‌రిగే నిర్ణ‌యాన్ని తీసుకుంటారు.. శ్ర‌మ అయితే అయ్యింది.. దాని గురించి ఆలోచించ‌టం వ‌దిలేయాల‌న్న మాట‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తుంటే.. మాట‌లు చెప్పినంత ఈజీ కాద‌ని స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు ఎన్నిక‌ల్ని ఎదుర్కోవ‌ట‌మ‌ని మ‌రికొంద‌రు నేత‌లు భిన్నాభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

కేసీఆర్ ప్ర‌యారిటీ చూస్తే.. తొలుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయ‌టం మీద‌నే ఉంటుంద‌ని.. ఉన్న వ‌న‌రులు.. శ‌క్తియుక్తుల‌న్ని వాటికే ధార‌పోస్తార‌ని..అలాంట‌ప్పుడు మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్యాడ‌ర్ ను క‌దిలించ‌టం.. ఉరుకులు..ప‌రుగులు పెట్టించ‌టం అంత ఈజీ కాద‌న్న మాట వినిపిస్తోంది.

వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు గుర‌య్యే అంశాన్ని సార్ అంత సింఫుల్ గా తీసుకోరు.. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌క్కా ప్లాన్ ఉండి ఉంటుంది. చూస్తూ.. చూస్తూ.. చేతిలో ఉన్న అధికారాన్ని వ‌దులుకోరు క‌దా? అన్న వాద‌న‌ను ఇంకొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే.. ఆ బ‌ల‌మే వేరుగా ఉంటుంద‌ని.. ఆ ఊపులో లోక్ స‌భ ఎన్నిక‌ల్నికొట్టి పారేయొచ్చ‌న్న మాట‌ను కొంద‌రు చెబుతుంటే.. ఫ‌లితం ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. కోలుకోలేని ప‌రిస్థితి ఉంటుంద‌న్న మాట‌ను కొంద‌రు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. గెలుపు ధీమా త‌ప్పించి.. మ‌రో అంశానికే తావు లేద‌న్న‌ మాట‌ను మెజార్టీ టీఆర్ ఎస్ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఓప‌క్క ధీమాను ప్ర‌ద‌ర్శిస్తూనే.. మ‌రోవైపు కూసింత సందేహంతో ఉన్న టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతూ.. అధినేత మాట‌ల్ని ప‌లు విధాలుగా విశ్లేషిస్తూ బిజీగా ఉండ‌టం క‌నిపించింది.