Begin typing your search above and press return to search.

కూల్చివేత‌ల‌పై వెన‌క‌డుగు లేనే లేద‌ట‌!

By:  Tupaki Desk   |   27 Sep 2016 3:26 PM GMT
కూల్చివేత‌ల‌పై వెన‌క‌డుగు లేనే లేద‌ట‌!
X
భారీ వ‌ర్షానికి చెరువును త‌ల‌పించిన భాగ్య‌న‌గరి హైద‌రాబాదులో అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై తెలంగాణ స‌ర్కారు క‌న్నెర్రజేసింది. నాలాలు - చెరువుల‌ను ఆక్ర మించుకుని క‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించే కార్య‌క్ర‌మానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్న‌నే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌ను విప‌క్షాలు సైతం స్వాగ‌తించాయి. అయితే ఊహించ‌ని విధంగా సొంత పార్టీ నేత‌ల నుంచే కూల్చివేత‌ల‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయి. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి... కూల్చివేత‌ల‌కు అడ్డంకులు క‌లిగిస్తున్న వారికి క్లాస్ పీకారు. ఈ క్ర‌మంలో అధికారులు కూల్చివేత‌ల‌కు సంబంధించి మ‌రింత వేగం పెంచారు.

ఇప్ప‌టిదాకా న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో వెల‌సిన 93 అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను అధికారులు కూల్చివేశారు. ఇక నేటి రాత్రిలోగా మ‌రో 80 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. కూల్చివేత‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ నేత‌లు ప‌లు ప్రాంతాల్లో అధికారుల‌ను అడ్డుకున్నారు. కూల్చివేత‌ల అడ్డ‌గింత‌ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్వ‌యంగా అడ్డుకోవ‌డంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. అయితే వెనువెంట‌నే రంగంలోకి దిగిన కేటీఆర్... వివేకానంద గౌడ్ కు క్లాస్ పీకిన‌ట్లు స‌మాచారం. దీంతో వివేకానంద గౌడ్ వెనుకంజ వేయ‌గా, అధికారులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుపోయారు. ఇదిలా ఉంటే న‌గ‌నంలోని అన్ని ప్రాంతాల్లో కూల్చివేత‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు కూడా అధికారుల‌ను అడ్డుకున్నారు. అయితే ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన నేప‌థ్యంలో పోలీసుల ప‌హారా మ‌ధ్య అధికారులు కూల్చివేత‌ల‌ను కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో స్థానికులు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకోవ‌డంతో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బాలా న‌గ‌ర్‌ - దిల్ సుఖ్ న‌గ‌ర్‌ - అల్లంతోట బ‌స్తీ - బంజారా లేక్‌ - క‌ర్మ‌న్ ఘాట్‌ - సుభాష్ న‌గ‌ర్‌ - రాజేంద్ర న‌గ‌ర్‌ - అరాంఘ‌ర్ చౌర‌స్తా - దుర్గా న‌గ‌ర్‌ - శివ‌రాంప‌ల్లి - మియాపూర్‌ - కుత్బుల్లాపూర్ - గాజుల రామారం - మారుతీన‌గ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో అధికారులు అక్ర‌మ కట్ట‌డాల‌ను కూల్చివేశారు. ఈ కూల్చివేత‌ల ప‌ర్వం మ‌రిన్ని రోజుల పాటు కొన‌సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/