Begin typing your search above and press return to search.

కేసీఆర్ అత్త‌గారి ఊళ్లోనూ ఎదురుదెబ్బే!

By:  Tupaki Desk   |   25 May 2019 5:07 AM GMT
కేసీఆర్ అత్త‌గారి ఊళ్లోనూ ఎదురుదెబ్బే!
X
ఎన్నో ఎన్నిక‌ల్ని చూసిన గులాబీ బాస్ కు తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని మాత్రం ఎప్ప‌టికి మ‌ర్చిపోలేర‌ని చెబుతున్నారు. కేసీఆర్ పొలిటిక‌ల్ కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కొన్ని ఎదురుదెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికి.. ఈ త‌ర‌హాలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎప్పుడు ఎదురుకాలేద‌ని చెబుతున్నారు. తాజా ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోవ‌టం పెద్ద విష‌యం కాదు కానీ.. త‌న కుమార్తె ఓట‌మికి గురి కావ‌టాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు. మిగిలిన ఓట‌మి అంతా ఒక ఎత్తు అని.. క‌విత ఓట‌మి మ‌రో ఎత్తుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల్లో కేసీఆర్ కు త‌గిలిన ఎదురుదెబ్బ‌ల లిస్ట్ లో తాజా అంశం చేరిన‌ట్లుగా చెప్పాలి. కేసీఆర్ అత్త‌గారి ఊళ్లోనూ టీఆర్ఎస్ వెనుక‌బ‌డింద‌ని.. ఇంత‌కాలం ఊరి అల్లుడిగా నెత్తిన పెట్టుకున్న గ్రామం.. ఈసారి అందుకు భిన్నంగా ఓట్లు వేసిన వైనం వెలుగు చూసింది.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన‌ప‌ల్లి మండ‌లం కొదురుపాక గ్రామం కేసీఆర్ అత్త‌గారి ఊరు అన్న విష‌యం తెలిసిందే. కేసీఆర్ అత్త‌గారి ఊరు.. ఎంపీ (రాజ్య‌స‌భ‌) సంతోష్ సొంతూరన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు అండ‌గా నిలిచిన కొదురుపాక‌లో ఈసారి ఎన్నిక‌ల్లో మాత్రం కారు స్పీడ్ త‌గ్గిపోయింది. క‌మ‌ల వికాసంతో కారు చిన్న‌బోయింది.

అక్క‌డి గ్రామ‌స్తులు అనూహ్యంగా బీజేపీకి జై కొట్ట‌టం విశేషం. ఆ ఊళ్లో మొత్తం 1756 ఓట్లు ఉంటే.. 1736 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో బీజేపీకి 883 ఓట్లు పోల్ అయితే.. టీఆర్ఎస్ కు 663 ఓట్లు మాత్ర‌మే పోల్ అయ్యాయి. అంటే.. ఆ గ్రామంలోనే బీజేపీకి 220 ఓట్ల అధిక్య‌త వ‌చ్చిన‌ట్లు. ఇక‌.. కాంగ్రెస్‌కు ఆ ఊళ్లో 97 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు 894.. కాంగ్రెస్ కు 827 ఓట్లు రాగా.. బీజేపీకి కేవ‌లం 83 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. మోడీ గాలి పుణ్య‌మా అని.. అంకెల్ని మారిపోయాయి. మోడీ గాలి ముందు కేసీఆర్ కారు చిన్న‌బోయిన ప‌రిస్థితి.