Begin typing your search above and press return to search.

6ల‌క్ష‌లు ట‌చ్ కావ‌టం ఖాయ‌మంట‌

By:  Tupaki Desk   |   24 Nov 2015 8:06 AM GMT
6ల‌క్ష‌లు ట‌చ్ కావ‌టం ఖాయ‌మంట‌
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఫ‌లితం టీఆర్ ఎస్ నేత‌ల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించ‌ని రీతిలో అద్భుత విజ‌యాన్ని వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్ట‌టాన్ని గులాబీ ద‌ళానికి ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు ఉండ‌టం లేదు. మూడు ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తే అదే మ‌హా గొప్ప అన్న అంచ‌నాకు మించి.. రికార్డు మెజార్టీ ఖాయ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ప్ర‌స్తుతం 16 రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 16 రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే నాటికి 4.07ల‌క్ష‌ల మెజార్టీతో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప‌సునూరి ద‌యాక‌ర్ దూసుకెళుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ అభ్య‌ర్థి క‌డియం శ్రీహ‌రికి వ‌చ్చిన 3.92ల‌క్ష‌ల మెజార్టీనే అత్య‌ధికం. అలాంటి మెజార్టీని కూడా 16వ రౌండ్ పూర్తి అయ్యే నాటికి క్రాస్ చేసేయ‌టం చూస్తుంటే.. తాజాగా వ‌చ్చే మెజార్టీ ఒక రికార్డుగా మార‌టం ఖాయ‌మ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రో ఆరు రౌండ్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉన్న నేప‌థ్యంలో ద‌యాక‌ర్ కు ఐదు లక్ష‌ల మెజార్టీ దాటిపోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. విప‌క్షాలైన కాంగ్రెస్‌.. బీజేపీ అభ్య‌ర్థుల‌కు ఓట్లు రావ‌ట‌మే గ‌గ‌నంగా మారిపోయిన నేప‌థ్యంలో.. కారు ధాటికి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్ప‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. గులాబీ ద‌ళం వేస్తున్న అంచ‌నాలు చూస్తుంటే.. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే స‌మ‌యానికి 5 ల‌క్ష‌ల మెజార్టీ దాటి 6 ల‌క్ష‌ల మెజార్టీని దాటినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ఇంత అద్భుత‌మైన మెజార్టీకి కార‌ణం అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తెలంగాణ అధికారాప‌క్షం వైపే ఓటర్లు ఉండ‌టంగా చెప్పొచ్చు.