జగ్గారెడ్డి ఆశల మీద ట్యాంకర్ నీళ్లు పోసిన కుంతియా

Tue Jun 25 2019 12:25:47 GMT+0530 (IST)

క్లారిటీ ఇచ్చేశారు కుంతియా. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొత్త కృష్ణుడ్ని తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కృష్ణుళ్లు పదవి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అలాంటివేమీ లేవన్న విషయాన్ని తేల్చి చెప్పారు కుంతియా.తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ అధ్యక్షుడి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించనున్నట్లు చెప్పారు. ఉత్తమ్ ను మార్చాల్సి వస్తే.. తన పేరును పరిశీలించాల్సిందిగా జగ్గారెడ్డి కోరగా.. అలాంటిదేమీ లేదని.. పార్టీ అధ్యక్షుడ్ని మార్చే ఉద్దేశం లేదన్న విషయాన్ని తేల్చేశారు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ అధ్యక్షుడి మార్పుపై వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు కుంతియా మాటలతో చెక్ పడినట్లుగా చెప్పాలి. 
పార్టీ రథసారధి విషయంలో మార్పు అపోహలు అక్కర్లేదని... గతంలో దొర్లిన తప్పుల్ని సరిదిద్దుకుంటామని.. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. పురపాలక ఎన్నికల్లో 50 శాతం సీట్లను తాము గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆశ పడిన జగ్గారెడ్డికి కుంతిమా స్పష్టత ఆయన మీద చల్లటి నీళ్లు పోసిందని చెప్పక తప్పదు.

ఈ పదవిని కోమటిరెడ్డి కూడా ఆశించాడు. బహిరంగంగా తన ఆశను వ్యక్తీకరించాడు. పీసీసీ ఛీఫ్ పదవి దక్కితేనే పార్టీలో కొనసాగుతానని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయనకు కూడా ఇది పెద్ద షాకే. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ అలక మరీ ఎక్కువైందని అంటున్నారు. ఎన్నికల ముందు చిరుమర్తి లింగమయ్య టిక్కెట్ విషయంలోనూ ఇలాగే అలిగారని... ఆయన కోరికను కాదనకుండా లింగయ్యకు టిక్కెట్ ఇస్తే... కనీసం అతన్ని పార్టీ మారకుండా ఆపలేకపోయారని ఇళా ప్రతిసారి కోమటి రెడ్డి బ్రదర్స్ తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.