Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడులో ట్విస్ట్ఃమంత్రి ప‌ద‌వికి రాజీనామా

By:  Tupaki Desk   |   24 April 2017 10:33 AM GMT
త‌మిళ‌నాడులో ట్విస్ట్ఃమంత్రి ప‌ద‌వికి రాజీనామా
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత న‌మ్మిన‌బంటు అయిన మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, ప్రస్తుత‌ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి బృందం మ‌ధ్య చ‌ర్చ‌లు మొదలైన సంగ‌తి తెలిసిందే. అయితే రెండు వ‌ర్గాలు త‌మ ష‌రత‌లు పెట్టాయి. ముఖ్యంగా ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై పీఠ‌ముడి ప‌డింది. మ‌రికొన్ని ప‌ద‌వుల విష‌యంలో పేచీ సాగుతోంది. అయితే ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన జ‌య‌కుమార్ చ‌ర్చల‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నందున ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా ప‌న్నీర్ సెల్వం వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పారు. సెల్వం వ‌ర్గంలోని కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాల‌నే డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో త‌న ప‌ద‌వి వ‌దులుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వివ‌రించారు. మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇటు సెల్వం వ‌ర్గం, అటు ప‌ళ‌నిస్వామి బృందం త‌మ ప్ర‌తిపాద‌న‌లు వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ ముంద‌స్తుగా జాబితా సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇచ్చేందుకు ప‌ళ‌ని వ‌ర్గం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని భావిస్తున్నారు. ఇదిలాఉండ‌గా...పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది. కానీ సెల్వం వ‌ర్గం మాత్రం త‌మ నాయ‌కుడికి సీఎం పీఠం ఇవ్వాల్సిందేన‌నే డిమాండ్‌తో ముందుకు సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/