Begin typing your search above and press return to search.

తెలంగాణ జేఏసీ ముక్క‌లైన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   23 Feb 2017 7:50 AM GMT
తెలంగాణ జేఏసీ  ముక్క‌లైన‌ట్లేనా?
X
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించ‌డంలో టీఆర్ ఎస్ పాత్ర ఎంత ఉందో - తెలంగాణ రాజ‌కీయ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి (టీ జేఏసీ) పాత్ర కూడా అంతే ఉంద‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్బ‌వించ‌డం, ఆ త‌ర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ‌కు తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో అప్ప‌టిదాకా క‌లిసి సాగిన టీఆర్ ఎస్‌ - టీజేఏసీల మ‌ధ్య క్ర‌మంగా దూరం పెరుగుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ రెండింటి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిస్థితి మారిపోయింది. టీఆర్ ఎస్ స‌ర్కారు ప్ర‌జా పాల‌న సాగించ‌డం లేద‌ని ఆరోపిస్తున్న టీజేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం... కేసీఆర్ విధానాల‌పై దాదాపుగా స‌మ‌ర‌శంఖ‌మే పూరించారు. అయితే కేసీఆర్ స‌ర్కారు కూడా కోదండ‌రాంను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటూనే ఉంది.

మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూసేక‌ర‌ణ అంశంపై టీఆర్ ఎస్‌ - జేఏసీ మ‌ధ్య పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఓయూలో నిన్న నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన స‌భ‌ - ర్యాలీల‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంది. కోదండ‌రాంను తెల్ల‌వార‌క‌ముందే అరెస్ట్ చేసింది. రాత్రి అయిన త‌ర్వాత గాని తిరిగి ఆయ‌న‌ను విడుద‌ల చేయ‌లేదు. తెల్ల‌వారుజామునే కోదండ‌రాం ఇంటి త‌లుపు త‌ట్టిన పోలీసులు - ఆయ‌న‌ను బ‌ల‌వంతంగానే అదుపులోకి తీసుకున్నారు. ఉద‌యం వ‌చ్చి స‌రెండ‌ర్ అవుతాన‌ని కోదండ‌రాం చెప్పిన‌ప్ప‌టికీ పోలీసులు విన‌లేదట‌. ఇక భ‌ర్త‌ను తెల్లార‌క‌ముందే అరెస్ట్ చేయ‌డంతో కోదండ‌రాం స‌తీమ‌ణి తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌న భ‌ర్త‌ను ఏం చేస్తారోన‌ని భ‌యప‌డ్డ ఆమె ఏకంగా న‌గ‌ర పోలీస్ కమిష‌న‌ర్‌ ను క‌లిశారు. గ‌వ‌ర్న‌ర్‌ ను కూడా క‌లిసేందుకు ఆమె య‌త్నించ‌గా, అది సాధ్య‌ప‌డ‌లేదు.

అయినా... కోదండ‌రాం అరెస్ట్ కావ‌డం ఇదే తొలి సారి ఏమీ కాదు. మ‌రి ఎప్పుడూ లేనిది కోదండ‌రాం స‌తీమ‌ణి బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చారు? ఇక్క‌డే అస‌లు విష‌యం వెలుగుచూసింది. కోదండ‌రాంను అరెస్ట్ చేసిన ప్ర‌భుత్వ తీరుపై విప‌క్షాల‌న్ని ఒంటికాలిపై లేవ‌గా, టీజేఏసీలోని ప‌లు ప‌క్షాలు అస‌లు ఆ విష‌యాన్నే ప్ర‌స్తావించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ప‌గ‌లంతా కోదండ‌రాం స్టేష‌న్‌ లోనే ఉంటే... ఆయ‌న‌ను ప‌లుక‌రించిన టీజేఏసీ నేత‌ల‌ను వేళ్ల మీద లెక్క‌పెట్టొచ్చ‌ని తెలిసింది. ఈ కార‌ణంగానే కోదండ‌రా స‌తీమ‌ణి త‌న భ‌ర్త‌ను కాపాడుకునేందుకు నేరుగా రంగంలోకి దిగార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... నేటి ఉద‌యం హైద‌రాబాదులో జ‌రిగిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ స‌మావేశంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని దృశ్యాలు క‌నిపించాయి. టీజేఏసీ క‌న్వీన‌ర్ హోదాలో ఉన్న పిట్టల ర‌వీంద‌ర్ స‌మావేశానికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి భేటీని తాను బాయికాట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన పెను క‌ల‌క‌ల‌మే రేపారు. అంతేకాకుండా చాలా మంది స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు స‌మావేశం ద‌రిదాపుల‌కే రాలేదు. జేఏసీలో కీల‌క భూమిక పోషిస్తున్న ప‌లు విద్యార్థి సంఘాల‌కు చెందిన నేత‌ల అడ్రెస్సే క‌నిపించ‌లేదు. ఇదంతా కోదండ‌రాం వ్య‌వ‌హార‌స‌ర‌ళి న‌చ్చ‌క‌నే జ‌రిగింద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిన్న‌టి నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను వ‌రుస‌గా ప‌రిశీలిస్తే... స‌మీప భ‌విష్య‌త్తులోనే కోదండ‌రాం ఏకాకిగా మారినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా నిన్న‌టిదాకా ఎలాంటి విభేదాలు లేకుండానే ప‌య‌నం సాగించిన టీజేఏసీ త్వ‌ర‌లోనే ముక్కలు చెక్క‌లు కాక త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/