Begin typing your search above and press return to search.

వామ్మో.. ఏం మాట సెప్పినావ్ టీజీ

By:  Tupaki Desk   |   31 May 2016 9:10 AM GMT
వామ్మో.. ఏం మాట సెప్పినావ్ టీజీ
X
కర్నూలు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కమ్ పొలిటీషియన్ టీజీ వెంకటేశ్ గురించి చాలా ఆసక్తికరమైన అంశాల్ని చెబుతుంటారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. కానీ.. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన ఉండే పార్టీ పవర్ లో మాత్రం కచ్ఛితంగా ఉంటుందనే చెప్పాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఆ పార్టీకి దూరంగా ఉండటం ఆయనకో అలవాటుగా చెబుతారు.

రాష్ట్ర విభజన సమయంలో సీమ ప్రయోజనాల మీద ఘాటైన వ్యాఖ్యలు చేసే ఆయన.. రాష్ట్ర విభజనకు సానుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న వెంటనే.. ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లటాన్ని కర్నూలు ప్రజలు ఇప్పటికి మర్చిపోలేరు. అంతా అయ్యాక.. కర్నూలుకు వచ్చి విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై సావధానంగా తన నిరసనను తెలపటం ఆయనకే చెల్లుతుంది.

రాజకీయాలకు తక్కువగా.. వ్యాపారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే టీజీ.. టైం చూసి మరీ తీసుకునే నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉంటాయని చెబుతారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని చాలామంది నేతలు చంద్రబాబును కలిసి కోరితే.. టీజీ మాత్రం బ్యాక్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయి.. తన అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయ్యాక బాబును కలిసినట్లుగా చెబుతారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పాలి.

ఏపీకి సంబంధించి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉంటారని అందరూ అంటారని.. కానీ వాస్తవంగా ఉన్న మంత్రులు ఐదుగురని చెప్పారు. అదెలానంటే.. తెలుగు ప్రాంతానికి చెందిన వెంకయ్య.. తెలిగింటి కోడలైన నిర్మలమ్మ.. తాజాగా నామినేషన్ వేయటం ద్వారా సురేశ్ ప్రభు.. ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గజపతి రాజు.. సుజనాలతో కలిపి మొత్తం ఐదుగురు మంత్రులు ఏపీకి ఉన్నట్లుగా లెక్క చెప్పారు. నామినేషన్ సమయానికే ఇన్ని మాటలు చెబుతున్న టీజీ.. రానున్న రోజుల్లో ఇంకెన్ని మాటలు చెబుతారో..?