Begin typing your search above and press return to search.

తెలంగాణ భ‌వ‌న్ లో టీ మంత్రికి చేదు అనుభ‌వం!

By:  Tupaki Desk   |   23 Nov 2017 8:52 AM GMT
తెలంగాణ భ‌వ‌న్ లో టీ మంత్రికి చేదు అనుభ‌వం!
X
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోయింది. ఎవ‌రి రాష్ట్రం వారిది. ఎవ‌రి పంచాయితీ వారిది. క‌లిసినప్పుడు హ‌లో అనుకోవ‌టం.. లెక్క‌లు తేడా వ‌చ్చిన‌ప్పుడు ఒక‌రినొక‌రు అనుకోవ‌టం మొద‌లైపోయింది. విభ‌జ‌న‌కు ముందు.. ఆ త‌ర్వాత కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రించి లెక్క‌లేసుకున్న‌ట్లుగా మాట్లాడే త‌త్త్వం ఉన్న టీడీపీ కూడా ఇప్పుడు ప్రాంతీయ జెండాను ప‌ట్టుకున్న‌ట్లే.

ఆ విష‌యాన్ని నంది అవార్డుల ర‌చ్చ సంద‌ర్భంగా లోకేశ్ త‌న వ్యాఖ్య‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇక‌.. తెలంగాణ అధికార‌పక్షం టీఆర్ ఎస్ కు ఆ త‌ర‌హా ప్రాంతీయ‌త‌త్వ్తం మొద‌టి నుంచి ఉన్న‌దే. మొత్తంగా చూస్తే.. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూర‌మో.. నా ఇల్లు నీ ఇంటికి అంతే దూర‌మ‌న్న వ‌ర‌కూ వ‌చ్చేసింది..

ఈ త‌ర‌హా భావ‌నంతా పై స్థాయి లోనూ.. రెండు ప్ర‌భుత్వాల ముఖ్య నాయ‌క‌త్వంలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఇక్క‌డ ఇంకో ముఖ్య‌మైన విష‌యం కూడా చెప్పాలి. అదేమంటే.. ప్రాంతీయ భావ‌న‌లు రాజ‌కీయ‌మైన ల‌బ్థి కోస‌మే కానీ వ్య‌క్తిగ‌త అంశాల్లో కాద‌న్న విష‌యం రెండు రాష్ట్రాల్లోని అధికార ప‌క్ష కుటుంబాల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

రాజ‌కీయం కోసం ఎంత‌వ‌ర‌కైనా సై అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే త‌త్త్వం పాల‌కుల్లో ఉన్నా.. ప్ర‌జ‌ల్లో లేద‌ని నిరూపించే ఉదంతం తాజాగా దేశ రాజ‌ధానిలో చోటు చేసుకుంది. సొంత రాష్ట్రానికి చెందిన భ‌వ‌నంలో తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ త‌గిలితే.. అందుకు భిన్నంగా ఆయ‌న‌కు ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్ర‌దేశ్ సిబ్బంది స్పందించి.. ఆయ‌న‌కు ఇబ్బంది లేకుండా చేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇటీవ‌ల ఒక అవార్డు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒక‌రు ఢిల్లీకి వెళ్లారు. త‌మ‌దైన తెలంగాణ భ‌వ‌న్ లో రూం తీసుకున్నారు. అవార్డు తీసుకొని రాత్రి 11 గంట‌ల వేళ‌లో తెలంగాణ భ‌వ‌న్ కు వ‌చ్చిన ఆయ‌న‌కు ప్రోటోకాల్ సిబ్బంది క‌నిపించ‌లేదు. ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకొచ్చిన వ్య‌క్తి కారు దిగ‌గానే న‌మ‌స్కారం పెట్టేశాడు.

స్వ‌ర్ణ‌ముఖి బ్లాక్ లో త‌న‌కు కేటాయించిన గ‌దికి చేరుకున్నారు మంత్రి. అక్క‌డి స‌హాయ‌కుడ్ని పిలిచి భోజ‌నం తీసుకురావాల‌ని చెప్పారు. మంత్రి గారి గురించి తెలీని స‌ద‌రు స‌హాయ‌కుడు ఇప్పుడిక్క‌డ భోజ‌నం దొర‌క‌ద‌ని చెప్ప‌ట‌మే కాదు.. ద‌గ్గ‌ర్లోని హోట‌ల్‌ కు వెళ్ళండి అంటూ ఉచిత స‌ల‌హా ప‌డేశాడు. దీన్ని ఊహించ‌ని మంత్రికి షాక్ త‌గిలినంత ప‌నైంది.

అదే వేళ‌లో ఆంధ్రాభ‌వ‌న్‌ కు చెందిన సిబ్బంది ఒక‌రు మంత్రిగారిని గుర్తించారు. ప్రాంతాల విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. మంత్రిగారికి ఇవ్వాల్సిన మ‌ర్యాద ఇస్తూ.. భోజ‌నం తీసుకొస్తానంటూ క్యాంటీన్‌ కు ప‌రుగున వెళ్లి భోజ‌నం తెచ్చి ఇచ్చాడు. సొంత భ‌వ‌నంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వానికి షాక్ తిన్నాడు. హైద‌రాబాద్‌ కు చేరుకున్న త‌ర్వాత మంత్రిగా ఉన్న త‌న‌నే ప‌ట్టించుకోని వైనంపై జేఏడీలో కంప్లైంట్ చేశారు. దీంతో అక్క‌డి అసిస్టెంట్‌ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. సొంత భ‌వ‌న్ అనుకున్న వేళ‌.. అక్క‌డ త‌మ‌ను ప‌ట్టించుకోకున్నా.. ఆంధ్రా సిబ్బంది గుర్తించి త‌న ఆక‌లి తీర్చిన వైనంపై స‌ద‌రు మంత్రి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం.