బాబుకు దడపుట్టిస్తున్న '40'

Wed Dec 13 2017 10:11:25 GMT+0530 (IST)

అంతా బాగుంది. మనకు తిరుగులేదు. ఇప్పుడే కాదు.. మరో పాతికేళ్లు మనదే అధికారం. రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసినట్లుగా ఎవరూ చేయలేరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి చాలానే మాటలు వస్తుంటాయి. మరి.. బాబు నోటి నుంచి వచ్చే మాటలన్ని నిజాలేనా? అన్న ప్రశ్న వేసుకొని సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.పైకి ధీమాగా మాట్లాడుతూ.. తమ పార్టీకి తిరుగులేదన్నట్లుగా చెప్పే చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎలా మాట్లాడతారు? ఏం చెబుతారు? అన్నది చూస్తే.. బాబులో మరో కోణం కనిపిస్తుంది. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు.. తాను చెప్పినట్లుగా చేయటంలో పార్టీ మంత్రులు మొదలు పార్టీ నేతల వరకూ ఎవరూ ఫాలో కావటం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం. ఏపీలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.  తక్షణమే రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్న సూచన చేశారు.

తాను చెప్పే 40 స్థానాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయకుంటే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను సైతం మార్చేందుకు మొహమాట పడనంటూ బాబు వార్నింగ్ ఇచ్చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ఉన్న మంత్రుల పని తీరు సంతృప్తికరంగా లేదన్న మాటను  బాబు చెప్పేసినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయమే థ్యేయంగా పని చేయాలని.. ఎన్నికల నాటికి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయటమే ప్రధమ లక్ష్యంగా పెట్టుకోవాలన్్న సూచన చేశారు.

బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన 40 నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిని సారించనున్నారు. సదరు నియోజకవర్గాలకు సంబంధించిన మరింత లోతైన చర్చ జరపటమే కాదు.. 40 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో తాను వేరుగా భేటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్టీ ప్రదాన కార్యదర్శులుగా ఉంటూ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జీల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు.. రాజకీయ అంశాల్లో ఇకపై అస్సలు మొహమాటం అన్నది ఉండదన్నారు. పదవులు తీసుకున్న వారు ఇంట్లో కూర్చుంటే ఊరుకునేది లేదంటూ తేల్చేశారు. అలాంటోళ్లకు మళ్లీ పదవులు ఉండవని.. ప్రజల్లోకి వెళ్లి పని చేస్తేనే వారికే పదవులని చెప్పేశారు. తనకు క్లోజ్ గా ఉండే వారిని పిలిచి భోజనం పెడతాను తప్ప టికెట్లు.. పదవులు ఇవ్వదల్చుకోలేదంటూ చెప్పిన చంద్రబాబు చేతల్లో అంత సాహసం చేయగలరా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఆ మధ్యన రాజ్యసభ సీటును కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేశ్‌కు ఇవ్వటమే నిదర్శనం.

టీడీపీకి ఆయన ఎంత కష్టపడ్డారో.. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన తర్వాత పార్టీ కోసం ఎంత శ్రమిస్తున్నారో అందరికి తెలిసిన ముచ్చటే. మరి.. అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు.. సమీక్షా సమావేశాల్లో బాబు చెప్పే మాటలకు పొంతన ఉన్నట్లుగా కనిపించదు.

ఇదిలా ఉంటే.. ఎప్పటి మాదిరే కొద్దిమంది నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు చంద్రబాబు.  సీనియర్ నేతలు కొందరిపై ఈ మధ్య కాలంలో తరచూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాబు అసంతృప్తికి గురైన వారిలో సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్.. వర్ల రామయ్య.. కొత్తపల్లి సుబ్బారాయుడులు ఉన్నారు.  

నేతల పని తీరుపై తానిక కఠినంగా ఉంటానని.. చెప్పినట్లుగా పని చేయకుంటే అవకాశాలు ఉండవని తేల్చేశారు చంద్రబాబు. తాను చెప్పిన వారిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు.  ఓపక్క పార్టీకి తిరుగులేదంటూనే.. మరోపక్క లోపాలు ఎత్తి చూపిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాబుకు తాజాగా మొదలైన 40 దడ ఎప్పటికి తీరుతుందో చూడాలి.