Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలకు మొగుడ్ని తెచ్చిపెట్టిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   14 Feb 2016 7:00 AM GMT
టీడీపీ నేతలకు మొగుడ్ని తెచ్చిపెట్టిన చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు పదవీ విరమణ చేసిన తరువాత సీనియారిటీ లిస్టులో కాస్త వెనక్కు ఉన్నప్పటికీ చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న అధికారి ఎస్పీ టక్కర్. కొత్త సీఎస్ గా ఆయన బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం పట్టలేదు... అయితే.. ఈ కొద్దికాలంలోనే టీడీపీ నేతలు హాహాకారాలు చేస్తున్నారట. అధికారులు, నేతల పాలిట ఆయన టఫ్ నట్ అని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్ డోర్ అనుమతులకు నో చెప్పేస్తున్నారని.. దీంతో కీలక నేతలు కూడా పనులు సాగక తెగ బాధపడిపోతున్నారట.

ఏపీలో ఇరిగేషన్ కాంట్రాక్టులు చేస్తున్న కాంట్రాక్టర్లు తాజా రేట్లు కావాలని కొన్నాళ్లుగా అడుగుతున్నారు. దానిపై గవర్నమెంటు నిపుణుల కమిటీ వేయగా వారు కొత్త రేట్లు అనవసరం అని చెప్పారు. అయితే.. అంతకుముందే హంద్రీనీవా - గాలేరు-నగరి ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలు పెంచేశారు. దానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అందులో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వంటి బడా కాంట్రాక్టర్లు ఉన్నారు. సుమారు 6 వేల కోట్ల మేరకు అంచనాలు పెంచారు. ఆర్ధికశాఖ ఆమోదం లేకుండానే అంచనా వ్యయాలు పెంచి, ఈ ఆరువేల కోట్లలో సగానికి పైగా డబ్బును ఇప్పటికే చెల్లించివేశారు కూడా. అయితే... కొత్త సీఎస్ టక్కర్ ఇలా అనుమతి లేకుండా కాంట్రాక్టర్లకు అక్రమంగా చెల్లించిన డబ్బుపై సీరియస్‌ అయ్యారు. అసలు తమ వద్ద నుంచి మంత్రివర్గంలోకి ఈ ఫైలును పంపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారట.

కాంట్రాక్టర్లు, తెలుగుదేశం నాయకులు కలిసి ఈ ఆరువేల కోట్లను దోచుకోవాడానికి వేసిన పథకానికి ఇంతకుముందున్న సీఎస్ కృష్ణారావు కూడా అడ్డుచెప్పారు. దాంతో దొడ్డిదారిన ఈ ఆరువేలకోట్ల ఫైల్‌ను ఓకే చేసుకోవడానికి క్యాబినెట్‌లో నోట్‌ పెట్టి మంత్రివర్గంచేత ఆమోద ముద్ర పొందడానికి ప్రయత్నించారట. మంత్రివర్గ సమావేశానికి పంపేముందు అనుమతి మంజూరు చేయాల్సిన గత సీయస్‌ ఐ వై ఆర్‌ కృష్ణారావు ఈ అవినీతి వ్యవహారానికి అంగీకరించలేదు. మంత్రివర్గ సమావేశానికి పంపించడానికి దానిపై తాను సంతకం చేయనని గట్టిగా చెప్పారట. ఆయన రిటైరైన తరువాత ప్రధానకార్యదర్శిగా వచ్చిన యస్‌.పి.టక్కర్‌ ద్వారా ఈ నోట్‌ను క్లియర్‌ చేసుకోవడానికి తెలుగుదేశం అధినేతలు ప్రయత్నించినా ప్రధానకార్యదర్శి టక్కర్‌ మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదని తెలిసింది. ఇదే కాదు ఇలాంటి మరికొన్ని వ్యవహారాలకూ టక్కర్ అడ్డుపడుతున్నారట. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబుకు తమకు ఇలాంటి మొగుడ్ని తెచ్చిపెట్టారంటూ తెగ బాధపడిపోతున్నారట.