Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల యవ్వారం మరీ చిల్లరగా మారిందే

By:  Tupaki Desk   |   24 Jan 2017 10:21 AM GMT
తమ్ముళ్ల యవ్వారం మరీ చిల్లరగా మారిందే
X
మిగిలిన రంగాల మాదిరే రాజకీయాల్లోనూ పోటీ మామూలే. ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం వారు నిత్యం ఏదొ ఒక ప్రయత్నం చేస్తుంటారు. తమ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం.. ఆరోపణలు సంధింటం లాంటివి చేస్తుంటారు. అధికారపక్షంలో ఉన్న వారికైతే ఇలాంటి కార్యక్రమాలుకాస్తంత తక్కువగా ఉంటాయి. అదేసమయంలో విపక్షంలో ఉన్న వారు నిత్యం జనంతో మమేకం కావటంతో పాటు.. అధికారపక్షంపై నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తుంటారు.

అధికార.. విపక్షాల మధ్య పోటీ మామూలే అయినా.. కొన్ని పార్టీల నేతలు.. కార్యకర్తలు తీరు మాత్రం చిరాగ్గా ఉండటమే కాదు.. చిల్లరగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి వైనం ఏపీ తెలుగుదేశం పార్టీ నేతల తీరులో కనిపిస్తుందన్న విమర్శలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రాజధాని రైతుల కష్టాల్ని స్వయంగా తెలుసుకునేందుకు అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే.

జగన్ పర్యటనకు భారీ స్పందన లభించటంతో పాటు.. పెద్దఎత్తున రైతులు రావటం ఆసక్తికరంగా మారింది. రాజధాని కారణంగా భూములు కోల్పోయిన వారిని.. దళిత రైతులతో ఆయన భేటీ అయ్యారు. వారి కష్టాలు విన్నారు. ఇదిలా ఉంటే.. జగన్ పర్యటన తర్వాత.. నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమాన్ని ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు చేయటం విమర్శలకు తావిచ్చింది. ఏపీ తమ్ముళ్ల తీరు చూస్తే.. విపక్ష నేత అమరావతిలో కాలు మోపటం కూడా తప్పు అన్నట్లుగా భావించటం ఓవరాక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే..ఒక ప్రాంతం.. ఒక భవనం ఫలానా వారికి మాత్రమే అని చెప్పటం సరికాదు. విధానాల పరంగా.. సిద్ధాంతాల పరంగా ఇరు వర్గాల మధ్య సవాలచ్చ పంచాయితీలు ఉండొచ్చు. కానీ.. వారి మనోభావాలు దెబ్బ తినేలా ఇలాంటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టం సరికాదన్న మాట వినిపిస్తోంది.

అత్యుత్సాహంతో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు ఏపీ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించటమే కాదు.. ఉరికే ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి భావోద్వేగాల్నిరెచ్చగొడతాయని చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలకు తగ్గట్లే జగన్ పార్టీ నేతలు.. తమ్ముళ్ల చర్యకు ప్రతి చర్య అన్నట్లుగా గో పంచకం.. గోమూత్రంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయి చేస్తున్న శుద్ధి కార్యక్రమాన్ని పట్టించుకోని పోలీసులు.. జగన్ పార్టీకి చెందినవారిని మాత్రం అడ్డుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసులు.. తమ ధర్మాన్ని తాము నిర్వర్తించాలే కానీ.. అధికార పక్షానికి కొమ్ము కాయటం ఏ మాత్రం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటే కనుక.. తెలుగు తమ్ముళ్లను నిలువరించి ఉంటే.. జగన్ పార్టీ నేతలు ప్రతి చర్యకు పూనుకునే వారుకాదని.. అయినా.. తమ్ముళ్ల చిల్లర వేషాలు ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. విపక్షాన్ని రెచ్చగొట్టే ఇలాంటి చర్యల కారణంగా ఉద్రికత్తలు పెరుగుతాయన్న విషయాన్ని అధికారపక్ష నేతలు గుర్తిస్తే మంచిది. లేకుంటే మరిన్ని విపరిణామాలు చోటు చేసుకోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/