Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల ట్రాక్ రికార్డ్ ఇంత బ్యాడా బాబు?

By:  Tupaki Desk   |   25 April 2018 4:25 AM GMT
త‌మ్ముళ్ల ట్రాక్ రికార్డ్ ఇంత బ్యాడా బాబు?
X
ర‌క్షించాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులే.. వ‌రుస పెట్టి దాడుల‌కు పాల్ప‌డ‌టానికి మించిన అన్యాయం ఇంకేం ఉంటుంది? మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యాలు.. అత్యాచారాల బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న తెలుగు త‌మ్ముళ్ల వైనాన్ని జాతీయ‌స్థాయిలో ఒక నివేదిక వెల్ల‌డించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. బాబు అనుకూల మీడియాలో ఏ మాత్రం క‌వ‌ర్ కాని ఈ వార్త‌లోని అంశాలు తెలుసుకుంటే త‌మ్ముళ్ల ఆరాచ‌కం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థ‌మైపోతుంది.

మ‌హిళ‌ల‌పై నేరాల కేసుల్లో చ‌ట్ట‌స‌భ్యులు అన్న అంశంపై అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్..జాతీయ ఎన్నిక‌ల ప‌రిశీల‌న స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఒక నివేదిక‌ను ఈ మ‌ధ్య‌నే విడుద‌ల చేశారు. ఇందులో మ‌హిళ‌ల‌పై దాడుల‌కు.. వారిపై పాల్ప‌డ్డ నేరాల‌కు సంబంధించిన కేసుల్ని ప్ర‌స్తావించటం గ‌మ‌నార్హం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల (ఎంపీలు.. ఎమ్మెల్యేలు) పై న‌మోదైన కేసులు.. వారు ప్ర‌స్తావించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ల ఆధారంగా నివేదిక‌ను సిద్ధం చేశారు.

ఇందులో పేర్కొన్న అంశాల్ని ప‌రిశీలిస్తే.. తెలుగు త‌మ్ముళ్ల ఘ‌న‌త ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. 4077 మంది ఎమ్మెల్యేలు.. 768 మంది ఎంపీల అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలించ‌గా వారిలో 33 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదై ఉన్న‌ట్లుగా తేలాయి. 48 మంది స‌భ్యుల‌పై మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా కేసులు న‌మోదైన‌ట్లుగా తేలింది. వీ. మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డిన 48 మంది ఎంపీలు.. ఎమ్మెల్యేల‌లో ఐదుగురు టీడీపీకి చెందిన నేత‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌హిళ‌ల‌పై అత్య‌ధిక నేరాల‌కు పాల్ప‌డినట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ప్ర‌జాప్ర‌తినిధుల్లో మ‌హారాష్ట్రకు చెందిన వారు మొద‌టిస్థానంలో ఉండ‌గా.. రెండో స్థానంలో ప‌శ్చిమ‌బెంగాల్‌.. మూడో స్థానంలో ఏపీ.. ఒడిశా ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే.. మొత్తం 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యులు.. ఎంపీలు ఉండ‌గా.. శివ‌సేన‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఏడుగురు ఉన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు ఆరుగురు అయితే.. టీడీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఐదురుగురు ఉన్నారు. మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డ‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలుగు త‌మ్ముళ్ల‌లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు అయిన‌ట్లుగా తేలింది. ఆయ‌న‌పై ఏకంగా 23 కేసులు న‌మోదైన‌ట్లు ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది.

వాటిలో అత్యంత తీవ్ర‌మైన ఐపీసీ సెక్ష‌న్లు ఉన్న‌వి 13 కేసులు ఉండ‌గా.. మొత్తం కేసుల్లో 75 సెక్ష‌న్ల కింద అభియోగాలు ఉన్నాయి.

ఇక‌.. ఏపీ మంత్రి.. కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై 13 కేసులు న‌మోదు కాగా.. అందులో తీవ్ర‌మైన కేసు ఒక‌టి ఉంది. మొత్తం 42 సెక్ష‌న్ల కింద అభియోగాలు న‌మోద‌య్యాయి. మ‌రో మంత్రి.. శ్రీ‌కాకుళం టెక్క‌లి ఎమ్మెల్యే కింజ‌ర‌పు అచ్చెన్నాయుడిపై మూడు అభియోగాలు.. విశాఖ‌ప‌ట్నం పెందుర్తి ఎమ్మెల్యే బంగారు స‌త్యానారాయ‌ణ‌మూర్తిపై నాలుగు కేసులు న‌మోద‌య్యాయి.

వీరే కాక అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ అలియాస్ వ‌రదాపురం సూరిపై మొత్తం 10 కేసులు ఉన్నాయి. వీటిల్లో 8 కేసులు తీవ్ర‌మైన సెక్ష‌న్ల‌తో ఉన్నాయి. ఆ ఆరోప‌ణ‌లు బాబు స‌ర్కారుకు మ‌చ్చ‌గా నిలుస్తాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హిళ‌ల హ‌క్కుల కోసం తాము విప‌రీతంగా పోరాడుతున్న‌ట్లుగా చెప్పుకునే బాబు.. ఈ నివేదిక చెప్పిన‌ట్లుగా త‌మ నేత‌ల తీరుపై ఏం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌మ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు ఎత్తివేస్తూ ఏపీ స‌ర్కారు ఇటీవ‌ల జీవో విడుద‌ల చేయ‌టంపై ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. హ‌త్య‌లు.. దోపిడీలు.. మ‌హిళ‌ల‌పై వేధింపులు.. ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులు.. దైర్జ‌న్యాలు.. బెదిరింపుల‌పై న‌మోదైన అభియోగాల్ని ఎత్తివేయ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా బాబు ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఏ మాత్రం మంచిది కాద‌ని చెబుతున్నారు. మ‌రి.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై ఏం చెబుతారు బాబు?