Begin typing your search above and press return to search.

మంత్రుల్లో కొత్త భ‌యం మొద‌లైంది

By:  Tupaki Desk   |   25 Sep 2016 10:42 AM GMT
మంత్రుల్లో కొత్త భ‌యం మొద‌లైంది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఇచ్చిన అల్టిమేటం ఆ రాష్ట్ర మంత్రుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంద‌ని అంటున్నారు. సార్వ‌త్రిక ఎన్నికలు జ‌రిగిన సుమారు రెండున్న‌రేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చ‌డంపై మంత్రుల‌ను బాధ్యులుగా చేయ‌నున్న‌ట్లు తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌త్యేక హోదా - కోర్టుకేసులు - క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీ విజ‌యం అంత తేలికేం కాద‌ని అమాత్యులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా అంశాల్లో ఉన్న వ్య‌తిరేక‌త ఇందుకు కార‌ణమ‌ని చెప్తున్నారు.

రెండున్నరేళ్ళ ప‌రిపాలన తర్వాత‌ వ‌స్తున్న ఎన్నికల్ని ప్రజలు రిఫరెండెంగా భావించే అవకాశముందని అందుకే జాగ్రత్త‌గా ముందుకు వెళ్లాల‌ని, మంత్రులు ఇందుకు బాధ్య‌త తీసుకోవాల‌ని బాబు స్ప‌ష్టంచేశారు. అయితే ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా అంశం ఆంధ్రుల‌ సెంటిమెంట్‌ గా స్ధిరపడిపోయిన ప‌రిస్థితులు ఒక‌వైపు...కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీతోనే స‌రిపుచ్చుతూ హోదాపై మొండిచేయి చూపిన తీరు మ‌రోవైపు... అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ‌ను టార్గెట్ చేస్తూ ఏపీలో రోడ్డెక్కుతున్న తీరుతో తెలుగుదేశం నాయ‌కుల్లో క‌ల‌వ‌రం క‌నిపిస్తోంద‌ని మంత్రులు అంటున్నారు.

అంతేకాకుండా రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో న్యాయ‌స్థానాల రూపంలో ఎదురుదెబ్బ‌లు త‌గల‌డాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్ప‌టికే రాజ‌ధాని నిర్మాణం కోసం ఉద్దేశించిన స్విస్ చాలెంజ్‌ పై న్యాయ‌స్థానం మొట్టికాయ‌లు వేసింది. ఈ నిర్ణ‌యాన్ని స‌మీక్షించుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. రాజ‌ధాని భూసేక‌ర‌ణ‌పై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ తుది తీర్పు వ‌చ్చే అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌ లో రానుంది. మ‌రోవైపు ఓటుకు నోటు కేసులో విచార‌ణ ముగించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వ‌డం కూడా తెలిసిందే.అంతేకాకుండా ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ దూకుడుగా వెళుతున్న ప‌రిస్థితి.

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అన్నది దశాబ్దాల నాటి డిమాండ్ అన్న విషయం తెలిసి కూడా కేంద్రం సదరు అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటమే కాకుండా విశాఖపట్నంకు బదులుగా విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటవుతుందని లీకులు ఇవ్వటంతో ఉత్తరాం ధ్రలో ప్రజలు మండిపడుతున్నారు. సాక్షాత్తు రైల్వే మంత్రిని టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపించిన‌ప్ప‌టికీ, కేంద్ర ప్ర‌భుత్వంతో మిత్ర‌ప‌క్షంగా ముందుకు సాగుతున్న‌ప్ప‌టికీ జోన్ కేటాయింపులో క్లారిటీ రావ‌డంలేదు. మొత్తంగా ఇటు రాజ‌కీయ పార్టీలు - అటు న్యాయ‌స్థానాల నుంచి క‌ల‌వ‌రం క‌లిగించే ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో పార్టీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డమ‌నే బాధ్య‌త‌లు త‌మకు అప్ప‌జెప్పడం ఇబ్బందిగా ఉంద‌ని రాష్ట్రమంత్రుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోందని ప‌లువురు చెప్తున్నారు. కేంద్రం ప్రకటన - ఏపీలోని ఆందోళ‌న‌లు - అసంతృప్తి - కోర్టు తీర్పులు యావత్తు ఈ ఏడాది చివరిలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త‌ప్ప‌కుండా ప్రభావం చూపుతుంద‌న్న ఆందోళన మంత్రుల్లో స్పష్టంగా కనబడుతుండ‌టం గ‌మ‌నార్హం.