Begin typing your search above and press return to search.

బీజీపీలోకి టీడీపీ కవిత?

By:  Tupaki Desk   |   29 May 2017 8:03 AM GMT
బీజీపీలోకి టీడీపీ కవిత?
X
ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో ఉన్న అతి కొద్ది మంది సినీ నటుల్లో కవిత ఒకరు. కానీ.. ఆమెను పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఎక్కడ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినా కవితను తీసుకెళ్లేవారు. సినిమా వాళ్లు వస్తే జనం కూడా బాగా వస్తారన్న ఉద్దేశంతో ఆమె సేవలను బాగా వాడుకున్నారు. కానీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఆమెను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె కూడా కొన్నాళ్లుగా పదేపదే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. చివరకు ఇక లాభం లేదని ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నాట్లుగా తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ లో జరిగిన మహానాడులోనూ ఆమెను వేదిక మీదకు పిలవకుండా అవమానించారు. అయితే మహానాడు వేదికపై స్థానం కల్పించడంతో పాటు , సరైన గౌరవం దక్కేలా చూస్తానని టీడీపీ నేత, పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత హామీ ఇవ్వడంతో కవిత విశాఖకు వచ్చారు. కానీ అనిత విజ్ఞప్తి చేసినా కవితను మాత్రం నిర్వాహకులు వేదిక మీదకు అనుమతించలేదు. దీంతో జరిగిన అవమానాన్ని చెప్పుకుని మీడియా ముందే భోరున విలపించారు కవిత. మహానాడును బహిష్కరించి హైదరాబాద్ వెళ్లిపోయారు.

లేటెస్టు సమాచారం ఏంటంటే ఆమెఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అంటే గిట్టని బీజేపీలో ఒక వర్గం ఆమెతో చర్చలు జరిపింది. కవిత రాకతో ఏపీలో పార్టీకి ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెను ఆహ్వానించారు. ఆమె కూడా టీడీపీలో ఉండి పదేపదే అవమానాలు ఎదుర్కోవడం కంటే బీజేపీలో చేరడమే మంచిదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నిజానికి కవితకు తమిళం, కన్నడ, తెలుగు, హిందీ బాషాల్లో మంచి పట్టు ఉంది. కాబట్టి బీజేపీలో చేరి… పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని జాతీయ స్థాయిలో ఉన్న ఒక బీజేపీ నేత కొద్దికాలం క్రితమే ఆమెను కోరారు. కానీ టీడీపీలోనే కొనసాగుతానని ఆమె అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారుకావడం, టీడీపీ పదేపదే అవమానిస్తుండడంతో ఆమె బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబుపై కోపంతో ఉన్న ఏపీ బీజేపీలో ఒక వర్గం ఇప్పుడు కవితను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపింది. అప్పుడప్పుడు టీడీపీ నేతలు బీజేపీని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా కవిత ఉపయోగపడుతారన్నది బీజేపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/