Begin typing your search above and press return to search.

అధికార పార్టీలో రాజీనామా రాజ‌కీయం

By:  Tupaki Desk   |   27 July 2017 7:31 AM GMT
అధికార పార్టీలో రాజీనామా రాజ‌కీయం
X
అనంత‌పురం జిల్లాలో రాజీనామా రాజ‌కీయం ట్విస్ట్‌ ల మీద ట్విస్టుల‌తో సాగుతోంది. జెడ్పీ చైర్మన్‌ గా కొనసాగుతున్న చమన్ ఈనెల 26న తాను రాజీనామా చేస్తానని ప్రకటించినప్ప‌టికీ ఆ దిశ‌గా నిర్ణ‌యం వెలువ‌డ‌క‌పోవ‌డంతో ఓ వ‌ర్గంలో ఉత్కంఠ నెల‌కొంది. ఏకంగా ఇద్ద‌రు మంత్రుల‌కు చమ‌న్ రాజ‌కీయం అంతుచిక్క‌డం లేద‌ని అంటున్నారు. ఎన్నికల అనంతరం చేసుకున్న ఒప్పందం మేరకు రెండున్నరేళ్లు చమన్, మిగతా రెండున్నరేళ్లు గుమ్మఘట్ట జడ్పీటీసీ నాగరాజు కొనసాగేలా నిర్ణయించారు. ఆ మేరకు ఈ ఏడాది జనవరి 5 నాటికి చమన్‌ కు ఇచ్చిన రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో మూడు నెలల పాటు వాయిదా పడింది. అనంతరం రాజీనామా చేయకపోవడంతో అధిష్టానం సీరియస్ అయింది.

ఈ నేప‌థ్యంలో చ‌మ‌న్ దిగివ‌చ్చారు. తన జన్మదినంతో పాటు అనివార్య కారణాల దృష్ట్యా రాజీనామా చేయలేక పోయాయని, ఈనెల 15 తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో ఈనెల 13న నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశం ఆయనకు ఆఖరుదని అందరూ భావించారు. అయితే 15వ తేదీ దాటిపోయినా రాజీనామాపై స్పష్టత రాలేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని 26న రాజీనామా చేస్తానని చెప్పారు.ఈ పరిస్థితుల్లో బుధవారం రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఆ రోజైనా రాజీనామా చేస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే 26న కూడా చ‌మ‌న్ రాజీనామా చేయ‌లేదు. మ‌రోవైపు జిల్లాకు చెందిన మంత్రులు కాలవ శ్రీనివాసులు - పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా చమన్‌ కు వారి మద్దతు కూడా ప్రత్యక్షంగా లేదని తెలుస్తోంది. కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో చమన్ రాజీనామా విషయంలో ఎవరూ సాహసించి అధిష్టానం ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేదు. అయితే బిసి అయిన పుట్టపర్తి నగర పాలక సంస్థ చైర్మన్ పిసి గంగన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఒప్పందం మేరకు ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చమన్ కూడా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందా? లేక రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ లేదా వేరే సంస్థాగత పదవి ఇస్తామని చెబుతుందా? అనే విషయం తేలాల్సి ఉంది.

కాగా, జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుండ‌టంలో చ‌మ‌న్ కంటే తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. క‌ర్నూల్ జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌లో ఓ వ‌ర్గం ఓట్లు కొల్ల‌గొట్టేందుకే చ‌మ‌న్ రాజీనామా విష‌యంలో టీడీపీ ఒత్తిడి చేయ‌డం లేద‌ని చెప్తున్నారు. ఉప ఎన్నిక ముగిసే వ‌ర‌కు రాజీనామా చేయాల‌ని తాము కోర‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు. మొత్తంగా పార్టీ క‌నుస‌న్న‌ల్లోనే ఈ ర‌కంగా ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య రాజీనామా రాజ‌కీయం సాగుతున్న‌ట్లు స‌మాచారం.