Begin typing your search above and press return to search.

నంద్యాల గెలుపుపై ఎవ‌రి ధీమా ఏమిటి?

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:33 AM GMT
నంద్యాల గెలుపుపై ఎవ‌రి ధీమా ఏమిటి?
X
రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతున్న నంద్యాల ఉప ఎన్నిక‌ల పోలింగ్ ఘ‌ట్టం ముగిసింది. ఓట‌ర్లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేసేశారు. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ సాగింది. అప్ప‌టికి క్యూ లైన్లో ఉన్న వారంద‌రిని ఓట్లు వేసేందుకు ఎన్నిక‌ల సంఘం అధికారులు అనుమ‌తించారు. నంద్యాల చరిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా భారీ పోలింగ్ న‌మోదైంది. మ‌రి.. ఈ పోలింగ్ అంతిమ ఫ‌లితం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

పోలింగ్ ముగిసిన త‌ర్వాత అధికార టీడీపీ.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేశారు. తామే గెలుస్తామంటే.. తామే గెలుస్తామ‌ని చెబుతున్నారు. గెలుపుపై రెండు వ‌ర్గాలు పోటాపోటీగా ఆత్మ‌విశ్వాసాన్ని వ్య‌క్తం చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కూ త‌మ గెలుపుపై రెండు వ‌ర్గాలు చెబుతున్న వాద‌న‌లు ఏమిటి? ఎందుకంత న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లుగుతున్నాయి? వారి న‌మ్మ‌కంలో ఉన్న లాజిక్కుల‌ను చూస్తే..

తెలుగుదేశం పార్టీ వాద‌న‌

+ నంద్యాల ప‌ట్ట‌ణంలో మెజార్టీ ల‌భించటం

+ పోలింగ్ పెరిగినా ఎవ‌రి పార్టీ వారు వారి పార్టీ వారికి ఓటు వేసుకోవ‌టం

+ నంద్యాల రూర‌ల్ మెజార్టీ ప‌క్కా

+ పెరిగిన పోలింగ్ అనుకూలంగా మారి 10 వేల వ‌ర‌కూ మెజార్టీ ఖాయం

+ మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఓటు వేయ‌టం సానుకూలాంశం

+ వైఎస్సార్ కాంగ్రెస్ కు ప‌ట్టున్న గ్రామీణ ప్రాంతాల్లోనూ టీడీపీకి అనుకూలంగా ఓట్లు ప‌డ‌టం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాద‌న‌

+ ఉద‌యం 7 గంట‌ల‌కే వంద‌ల సంఖ్య‌లో మ‌హిళ‌లు ఓట్లు వేసేందుకు సిద్ధం కావ‌టం.

+ స‌హ‌జంగా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడు మాత్ర‌మే క‌క్ష క‌ట్టిన‌ట్లుగా ఓటింగ్ లో పాల్గొన‌టం

+ నంద్యాల రూర‌ల్‌.. గోస్పాడు మండ‌లాల్లో పోలింగ్ అత్య‌ధికంగా న‌మోదు కావ‌టం

+ నంద్యాల ప‌ట్ట‌ణంలో ఓట్ల శాతం త‌గ్గ‌టం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప‌ట్టు ఉన్న వార్డుల్లో అత్య‌ధిక పోలింగ్ జ‌ర‌గ‌టం

+ పోలింగ్ సంద‌ర్భంగా నిశ్శ‌బ్ద విప్ల‌వం క‌నిపించింది

+ గోస్పాడులో 8 వేలు.. నంద్యాల రూర‌ల్ లో 5వేలు మెజార్టీ రావ‌టం ఖాయం

+ టీడీపీ వారు చెబుతున్న‌ట్లు నంద్యాల ప‌ట్ట‌ణంలో 10వేల మెజార్టీ వ‌చ్చినా.. జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థికి వ‌చ్చే 13వేల మెజ‌రా్టీని తీసివేస్తే 3వేల అధిక్య‌త‌తో విజ‌యం ప‌క్కా

+ ఓట‌మి భ‌యంతోనే పోలింగ్ రోజున అధికార‌పార్టీ గొడ‌వ‌ల‌కు.. ఆరాచ‌కాల‌కు పాల్ప‌డ‌టం