తెలంగాణలో టీడీపీ మహిళా నేత దారుణహత్య

Tue Mar 13 2018 11:01:20 GMT+0530 (IST)

దారుణం చోటు చేసుకుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు 30 ఏళ్ల రామిల్ల కవితను అత్యంత దారుణంగా హతమార్చిన వైనం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ హత్య జరిగింది. ఇంట్లో నిద్రపోతున్న ఆమెను కిరాతకంగా హతమార్చారు.కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు పదిహేనేళ్లు కాగా.. మరొకరు పద్నాలుగేళ్లు. పదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఆమె.. విడిగా ఉంటున్నారు. కూతుళ్లను చదివించుకుంటూ జీవిస్తున్నారు. బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె ఆదివారం మంథని వెళ్లారు.

అక్కడ ఫంక్షన్ పూర్తి అయ్యాక ఆమె తన చిన్నకుమార్తెను విడిచి.. పెద్ద కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరారు. అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కవితపై దాడికి యత్నించారు. ఈ సమయంలో తల్లిని కాపాడేందుకు పెద్ద కుమార్తె ప్రయత్నించింది. దీంతో దుండగులు.. చిన్నారి చేతులు.. కాళ్లు కట్టేసి మరో గదిలో బంధించారు.

అనంతరం ఆమె చూస్తుండగానే కవిత తలపై కత్తిపీటతో దాడి చేసి.. నరికి హత్య చేశారు. అనంతరం ఆమె మీద ఉన్న నగలు.. ఇంట్లోని వెండి సామాన్లు తీసుకొని పారిపోయారు. ఈ హత్యకు కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఒక మహిళా నేతను అంత కిరాతకంగా ఎందుకు హతమార్చారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.