Begin typing your search above and press return to search.

లక్ష కోట్లు కంటే పవర్ ఫుల్ డ్యామేజ్..?

By:  Tupaki Desk   |   5 Sep 2015 8:02 AM GMT
లక్ష కోట్లు కంటే పవర్ ఫుల్ డ్యామేజ్..?
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ను ఎదుర్కోనేందుకు ఏపీ అధికారపక్షం ఒక పవర్ ఫుల్ అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. తనదైన వ్యాఖ్యలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకు వీలుగా తెలుగు తమ్ముళ్లు పక్కా ప్లాన్ ఒకటి సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

ఐదు రోజులు పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని పరిశీలిస్తే.. తమ్ముళ్ల తాజా వ్యూహం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకూ జగన్ మీద విమర్శలు చేయటానికి లక్ష కోట్ల మాటను పదే పదే వాడేసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆ పవర్ ఫుల్ మాటకు జతగా.. ‘‘కేసీఆర్ మాటే.. జగన్ మాట’’ అన్న విమర్శను తరచూ వినియోగించటం కనిపిస్తోంది.

అంతేకాదు.. తెలంగాణ అధికారపక్షానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ అని.. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్ని కేసీఆర్ కొనేసినా కూడా జగన్ కు కోపం రాదంటూ చేస్తున్న వ్యాఖ్యలు భారీ డ్యామేజీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నా.. ఆ మాట చేసే నష్టం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

లక్ష కోట్ల రూపాయిల్ని జగన్ సంపాదించేశాడని తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజంగా జగన్ లక్ష కోట్లు వెనకేశాడా? అంటే.. అది సందేహమే. ఎందుకంటే.. ఈడీ మొదలుకొని వివిధ దర్యాప్తు సంస్థలన్నీ కిందామీదా పడి.. లెక్కలు తేలిస్తేనే.. జగన్ అక్రమాస్తుల విలువ రూ.25వేల కోట్ల కంటే తక్కువగా ఉంటుందని లోగుట్టుగా చెబుతుంటారు.

కానీ.. ఆ మాటను తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్కరికి చెప్పినా నమ్మరు. జగన్ కనీసం లక్ష కోట్లు సంపాదించి వెనకేసి ఉంటారన్న మాటకే కట్టుబడతారు. జగన్ ను వీరగా అభిమానించే వారి తప్పించి.. మిగిలిన వారంతా కూడా లక్ష కోట్లకు అధిపతి జగన్ అనే మాటనే విశ్వసిస్తారు. జగన్ ను అభిమానించే వారిలో కూడా కొందరైతే.. ఏం మా జగన్ లక్ష కోట్లు సంపాదిస్తే తప్పేంటని వాదించేవాళ్లూ ఉన్నారు.

లక్ష కోట్ల ఆస్తి ఉన్నా లేకున్నా.. ఆ మొత్తాన్ని అక్రమంగా సంపాదించాడన్న చెడ్డ పేరును మాత్రం జగన్ మూట గట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధాలు ఏ మేర ఉన్నాయో బయటకు రావు కానీ.. చాలా బాగా ఉన్నాయన్న ప్రచారాన్ని మాత్రం తెలుగు తమ్ముళ్లు ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇదే విషయాన్న పలుమార్లు ప్రస్తావించటం వ్యూహాత్మకంగానే చెప్పాలి.

ఎందుకంటే.. లక్ష కోట్లు జగన్ సంపాదించారంటే మండి పడే వారి కంటే కూడా.. ఏపీని కష్టాల కాసాగరంగా మార్చేసిన కేసీఆర్ తో జట్టు కట్టారంటే మాత్రం సీమాంధ్రులు సహించలేని పరిస్థితి. ఈ విషయం తెలుసు కాబట్టే.. వీలైనన్ని ఎక్కువసార్లు.. జగన్ కు.. కేసీఆర్ కు మధ్య అనుబంధం భారీగా ఉందన్నట్లుగా చెప్పటం కనిపిస్తుంది. దీనికి తగ్గట్లే.. శుక్రవారం అసెంబ్లీ లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్ చేశారని.. దానికి తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఏపీ అసెంబ్లీలో ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రస్తావించి.. రచ్చ చేయాల్సిందిగా ఆదేశించటంతో జగన్ ఆ విషయాన్ని ప్రస్తావించారన్న మాటలే నిదర్శనంగా చెప్పొచ్చు.

ఏపీ సర్కారును.. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టటానికి ఓటుకు నోటుకు మించిన వ్యవహారం మరేం ఉంటుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి చెబితేనే జగన్ స్పందిస్తారా? ఆయనకు మాత్రం తెలీదా? మంత్రి అచ్చెన్నాయుడి ఆరోపణల్లో నిజానిజాలు ఎంత ఉన్నా.. సామాన్యుల్లో మాత్రం అవునేమో అన్న సందేహం కలగటం ఖాయం. కేసీఆర్ తో తనకు అనుబంధం ఉందన్న మాట కారణంగా కలిగే నష్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించినందుకు వల్లే కావొచ్చు.. జగన్ నోటి నుంచి తీవ్రమైన సవాళ్లు వినిపించాయి.

తనకు కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసినట్లు ఆధారాలు చూపిస్తే.. తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ తీవ్రస్వరంతో జగన్ వ్యాఖ్యానించారు. ఏమైనా ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు చెక్ చెప్పాలని జగన్ ప్రయత్నిస్తుంటే.. కేసీఆర్ తో జగన్ కు ఉన్న అనుబంధం అంతాఇంతా కాదంటూ ఏపీ అధికారపక్షం ప్రయత్నిస్తుంది. ఓటుకు నోటు చేసే చేటు కంటే కూడా.. కేసీఆర్ తో జగన్ చెట్టాపట్టాలు వేసుకుంటున్నారన్న ఆరోపణే ఎక్కువగా నష్టం చేస్తుందన్నది మాత్రం వాస్తవం. మరి.. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేయటానికి జగన్ ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారో చూడాలి