Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఓటేస్తారా వేయరా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 6:53 AM GMT
చంద్రబాబుకు ఓటేస్తారా వేయరా?
X
రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? నవ్యాంధ్రలోని ఓటర్లంతా ఎదుర్కొంటున్న ప్రశ్న ఇది. పైగా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ‘ఇప్పుడేం ఎన్నికలు’ అనుకుంటూ ఫోన్ కట్ చేశారనుకోండి.. మళ్లీ అయిదు నిమిషాల్లోనే మరోసారి ఫోన్ వస్తుంది. అలా చెప్పేవరకు వస్తూనే ఉంటుందట. ఏపీలో ప్రజలకు 04038399999 నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చి.. ఐవీఆర్ లో ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తార’ని ప్రశ్న వేయడంతో పాటు ఆప్షన్లు కూడా ఇస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్.. జనసేన.. తెలుగుదేశం/బీజెపి - వామపక్షాలు.. అంటూ ఆప్షన్లు ఇచ్చి అందులో ఎవరికి ఓటేస్తారనో చెప్పాలంటూ అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.

హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయం నుంచి ఈ రకమైన ప్రశ్నలు ఫోన్లకు వస్తున్నాయి. తిరిగి అదే నెంబరుకు ఫోన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి స్వాగతం అంటూ పార్టీ సంక్షేమ కార్యక్రమాలైన ప్రమాదబీమా - ఇతర సమాచారాన్ని సేకరించేందుకు ఫలానా నెంబరును ప్రెస్ చేయాలనే సంకేతాలు అందుతున్నాయి. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీ ఏపిలో ప్రజాభిప్రాయ సేకరణ భారీ ఎత్తున జరుపుతోందని తెలుస్తోంది. కొత్త రాజధాని - పోలవరం నిర్మాణం.. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు.. కేంద్ర సాయంపై బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగంతోపాటు పార్టీ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - ప్రధాన కార్యదర్శి లోకేష్ టెక్నాలజీ వినియోగంతో ముందస్తు వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నీ తానే అయి శాఖల పనితీరుని పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా అభియోగాలు వస్తున్నందున సర్వేలు - ప్రజాభిప్రాయం ద్వారా పనితీరును తెలుసుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ కు చెందిన 20 మంది వరకు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న అనంతర పరిణామాలను కూడా అధినేత నిశతంగా పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది.

మరోవైపు జనసేన పార్టీకి వేరుగా ఆప్షన్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొబైల్ ద్వారా వచ్చే ప్రశ్నలలో బిజెపిని కలుపుకుంటూ రెండింటికీ మద్దతిచ్చిన జనసేన పార్టీ విజయావకాశాలపై అభిప్రాయాలు కోరటంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగా ఇప్పుడే ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి వస్తోందనే విషయమై అధికార పార్టీలో చర్చకు వస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రభుత్వరంగ సంస్థల విభజన అంశాలతో పాటు పోలవరాన్ని కేంద్రం కూడా వివాదాస్పదంగా పరిగణిస్తోందని, వీటినే ప్రతిపక్ష పార్టీలు విమర్శన అస్త్రాలుగా సంధిస్తున్నందున కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.