పవన్ కు రివర్స్ పంచ్ లు పడుతున్నాయ్

Mon Apr 16 2018 16:41:02 GMT+0530 (IST)

అందుకే అంటారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని. అందులోకి పవన్ కల్యాణ్ లాంటోడు మాట్లాడేటప్పుడు రెండు.. మూడు కోణాల్లో ఆలోచించి మాట్లాడాలి.  కానీ.. వాటిని పట్టించుకోకుండా తనకు తోచినట్లుగా ఆరోపణల బురద వేసేసిన పవన్ కు.. ఇప్పుడు అంతకు మించిన బురద పవన్ మీద పడుతోంది.నాలుగేళ్ల పాటు బాబు బ్యాచ్ తో రాసుకుపూసుకు తిరిగిన పవన్ కు బాబు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే.. అనుభవం పేరుతో సర్ది చెప్పటం మర్చిపోకూడదు. ఏమైందో ఏమో కానీ.. పార్టీ ఆవిర్భావ సభ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీని ఉద్దేశించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనని పవన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అవినీతిపై కన్నెర్ర చేశారు. హద్దులు దాటుతున్న అవినీతితో ఏపీ ఆగమాగమైపోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మరింత కాలం ఏం చేశారు పవన్ అన్న ప్రశ్న అడగనీయకుండా తాను చెప్పాల్సింది చెప్పేసుకెళ్లారు. ఈ హడావుడిలో లోకేశ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక దందా జరుగుతుందని.. కొడుకు అవినీతి గురించి మీ దృష్టికి వచ్చిందా బాబు? అంటూ వేసిన ప్రశ్నకు టీడీపీ బ్యాచ్ ఆవేశంతో రగిలిపోయింది.

నాలుగేళ్లు స్నేహంగా ఉంటూనే..చివర్లో భలే దెబ్బేశాడే అంటూ కిందామీదా పడిన తెలుగు తమ్ముళ్లు.. మీరిన్ని చెబుతున్నారు.. చినబాబు చేసినట్లుగా చెబుతున్న ఆరోపణలకు ఆధారాలు చూపించు? అని అడిగినంతనే.. అందరికి తెలిసిన వాటికి రుజువులు ఎందుకు? అయినా రశీదులు తీసుకొని లంచాలు తీసుకుంటారా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు పవన్.

ఇదిలాఉండగా.. తాజాగా పవన్ పై విరుచుకుపడుతున్నారు జూనియర్ ఆర్టిస్ట్ లు. టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ కు మసాజ్ లు చేయటానికి బెంగాలీ అమ్మాయిలు కావాలంటారని.. మహిళలు ఎవరూ ఓటు వేయకూడదని ఆమె వ్యాఖ్యానించింది.

మొన్నటిదాకా పవన్ మీద ఎలా రిటార్ట్ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న తెలుగుతమ్ముళ్లకు సదరు ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు తాజా ఆయుధాలు అయ్యాయి. లోకేశ్ మీద బురద జల్లినప్పుడు ఆధారాలు అడిగితే.. రశీదులు ఇచ్చి మరీ తప్పు చేస్తారా? అన్న ప్రశ్నను పవన్ వేసినప్పుడు.. ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకు ఆధారాల అవసరం లేదని తేల్చేస్తున్నారు. మసాజ్ లు చేయించుకునేటప్పుడు వీడియోలు తీయించుకొని మరీ చేయించుకుంటారా ఏంటి?  అంటూ ఇరుకున పెట్టేలా పంచ్ లు వేస్తున్నారు. మొత్తానికి జనసేనానిగారు తనకు తానుగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడాయనకు పంచ్ లుగా మారటమే కాదు.. సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి చేసేలా మారాయనటంలో సందేహం లేదు. అందుకే.. మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరిస్తే ఇలాంటి తలనొప్పులు ఎదురుకావు కదా?