Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌కు బాబు ఝ‌ల‌క్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   24 Sep 2017 9:08 AM GMT
సీనియ‌ర్ల‌కు బాబు ఝ‌ల‌క్ ఇచ్చారే!
X
దేశ రాజ‌కీయాల్లో మ‌నుషుల్ని అవ‌స‌రానికి వాడుకుని వ‌దిలేయ‌డంలో చంద్ర‌బాబును మించినోళ్లు లేర‌ని విమ‌ర్శ‌కులు అంటుంటారు. అలాంటిది త‌న‌నే ధిక్క‌రిస్తూ.. లెక్క‌చేయ‌క‌పోతే వారిని ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల‌ నీళ్లు తాగించ‌డంలో ఘనాపాఠి అని కూడా చెబుతుంటారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఎన్నో సంఘ‌ట‌ల‌ను చెబుతుంటారు విమ‌ర్శ‌కులు. తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుందో తెలుసుకునే అవ‌కాశం రానే వ‌చ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షులను - కార్వ‌నిర్వాహ‌క వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావును మ‌ళ్లీ నియ‌మించ‌గా.. తెలంగాణ‌కు పార్టీ అధ్య‌క్షుడిగా ఎల్‌.ర‌మ‌ణ‌ను - వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన రేవంత్‌ రెడ్డిని నియ‌మించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నాపార్టీ కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌పడ్డ సీనియ‌ర్ల‌కు మాత్రం జెల్ల‌కొట్టారు. వారిని రెండు రాష్ట్రాల క‌మిటీల్లో ఎందులోనూ నియ‌మించ‌కుండా, ఎలాంటి ప‌దవి లేకుండా పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టేశారు.

వివ‌రాల్లో కెళ్తే రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే - సీనియ‌ర్ తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌కు పొలిట్ బ్యూరోలో కానీ, ఇత‌ర రాష్ట్ర క‌మిటీల్లో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న పార్టీ అధిష్టానాన్ని విమ‌ర్శిస్తూ బ‌హిరంగ లేఖ రాయ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈయ‌న రాసిన దానిలో త‌ప్పేమీ లేదండీ. పార్టీలో మొద‌టి నుంచీ ఉంటున్న‌వారిని కాద‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌దవులు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌డ‌మే దీనికి కార‌ణం. ఈ మాత్రానికే ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌కుండా ప‌క్క‌న‌బెట్టేశారు.

ఇక ప్ర‌కాశం జిల్లాలో పార్టీకి బ‌ల‌మైన నేత‌.. ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. గ‌తంలో ఎంపీగా - ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఈయ‌న‌కు కూడా పార్టీలో ఎలాంటి ప్రాతినిధ్యం క‌ల్పించ‌కుండా హ్యాండ్ ఇచ్చారు. ఈయ‌న చేసిన పాప‌మ‌ల్లా.. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌విని పార్టీలో ఎలా చే్ర్చుకుంటార‌ని ప్ర‌శ్నించ‌డ‌మే. పైగా ర‌వితో గొడ‌వ‌లు ప‌డుతూ పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని క‌ర‌ణంకు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌కుండా కాటు వేశారు.

చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిని కూడా ఏ క‌మిటీలోనూ నియ‌మించ‌కుండా బ‌జ్జోపెట్టేశారు. గ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ‌ - ఆదినారాయ‌ణ రెడ్డి - అమ‌ర్‌ నాథ్‌ రెడ్డి లాంటి వాళ్ల‌కు మంత్రిప‌ద‌వులు ఇవ్వ‌డానికి అడ్డుగా ఉన్న బొజ్జ‌ల‌పై వేటేశారు. పైగా ఆయ‌న అనుకున్నంత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని, మంత్రిగా విఫ‌ల‌మ‌య్యార‌ని త‌న పెంపుడు ప‌త్రిక‌ల్లో రాయించారు. దీంతో అలిగిన బొజ్జ‌ల తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తాన‌ని అప్ప‌ట్లో హైడ్రామా న‌డిపారు. దీన్నిమ‌న‌సులో ఉంచుకున్న చంద్ర‌బాబు తాజాగా రాష్ట్ర క‌మిటీలు, పొలిట్ బ్యూరోల్లో ఏ ప‌దవీ ఇవ్వ‌కుండా బొజ్జ‌ల‌ను మ‌రోసారి చిన్న‌చూపు చూశారు.

ఇక రాజ‌ధాని నెల‌వై ఉన్న‌గుంటూరు జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటూ.. ద‌ళిత నేత‌ల్లో పేరున్న జెఆర్ ఫుష్ప‌రాజ్‌కు కూడా ఏ ప‌ద‌వీ ఇవ్వ‌కుండా జెల్ల‌కొట్టేశారు. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కు రాజ్యస‌భ ఎంపీ అని - ఎమ్మెల్సీ అని - కేబినెట్ స్థాయి ప‌ద‌వి అని ఊరించి.. చివ‌ర‌కు రాష్ట్ర కమిటీలో కూడా చోటు కల్పించ‌కుండా ఉసూరుమ‌నిపించారు బాబు

ఇక కోస్తాంధ్ర న‌డిబొడ్డు విజ‌య‌వాడ‌లో కాపు నేత‌గా - సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా - మంచి వాగ్ధాటి ఉన్న నేత‌గా పేరొందిన బొండా ఉమామహేశ్వ‌ర‌రావుకు పై నేత‌ల గ‌తే ప‌ట్టింది. అసెంబ్లీలోనూ - బ‌య‌టా అధికార పార్టీ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని ప్ర‌తిఫక్షంపై గొంతు చించుకునే బొండాకు ఏ క‌మిటీలోనూ ప‌ద‌వి ద‌క్క‌లేదు. గ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించిన బొండా.. మంత్రి కాలేక‌పోవ‌డంతో కాపుల గొంతు కోశార‌ని - వాడుకుని వ‌దిలేశార‌ని మీడియాకు ఎక్క‌డంతో ఒళ్లు మండిన చంద్ర‌బాబు త‌గిన స‌మయం చూసి బొండాకు క‌ర్ర కాల్చివాత‌పెట్టారు. ఇలా అణిగిమ‌ణిగి ఉంటేనే ప‌దవులు లేక‌పోతే చుక్క‌లేన‌ని అన్యాప‌దేశంగా త‌మ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.