హైదరాబాద్ వెళితే.. పార్టీ మారినట్లా? ఇదేం ప్రచారం

Fri Mar 15 2019 10:09:05 GMT+0530 (IST)

ఏపీ మంత్రి పితానికి కోపం వచ్చింది. తన మానాన తాను హైదరాబాద్ వెళుతుంటే.. దానిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీని విడిచిపెడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. తాను పార్టీ మారాలన్న ఆలోచనలో లేనని.. అలా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.కేవలం గందరగోళాన్ని సృష్టించేందుకు పూర్తిగా అవాస్తవమైన కథనాల్ని ప్రచారంలోకి తెస్తున్నారే తప్పించి మరింకేమీ లేదన్నారు. హైదరాబాద్ వెళితే చాలు.. పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేయటాన్ని తప్పు పట్టారు. తాను వ్యక్తిగతంగా ఉన్న పని కోసం హైదరాబాద్ కు వెళుతున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్.. ఢిల్లీలకు వెళితే తప్పేంటి? అని ప్రశ్నించిన ఆయన.. ఎక్కడికి వెళ్లకూడదా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ వెళితే పార్టీ మారినట్లుగా ప్రచారం చేయటం వెనుక తన రాజకీయ ప్రత్యర్థుల మైండ్ గేమ్ గా ఆయన అభివర్ణించారు. తాను మార్చి ఒకటి నుంచి 12 వరకూ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు చెప్పిన పితాని.. హైదరాబాద్ లోని తన తోడల్లుడి కొడుకు పెళ్లి జరుగుతుందని.. అందుకే తాను హైదరాబాద్ వెళుతున్నట్లు చెప్పారు.

తాను హైదరాబాద్ వెళుతున్నది జగన్ ను కలిసేందుకన్న మీడియా ప్రచారం తప్పన్న ఆయన.. తాను టీడీపీలోనే కొనసాగనున్నట్లుగా చెప్పారు. వ్యక్తిగత అంశాల్ని పట్టుకొని రాజకీయంగా మార్చేసి తప్పుడు ప్రచారం చేయటం ఏ మాత్రం సరికాదన్నారు.