సీక్రెట్ దోస్తీపై మరింత క్లారిటీ వచ్చేసిందిగా!

Fri Aug 10 2018 22:06:52 GMT+0530 (IST)

తెలుగు దేశం పార్టీ... దేశాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు పుట్టిన పార్టీ. ఢిల్లీ వీధుల్లో తెలుగు జాతికి జరుగుతున్న అవమానాన్ని చూసి చలించిపోయిన స్వర్గీయ నందమూరి తారకరామారావు.. తెలుగు జాతి సత్తా ఏమిటో కాంగ్రెస్ కు చూపించేందుకే టీడీపీకి జీవం పోశారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి సందేహం కూడా లేదనే చెప్పాలి. ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న తొలితరం నేతలు కూడా ఇదే భావనతో ఉన్నారు. అయితే టీడీపీలోని ఆ పాతకాపులకు ఇప్పుడు జరుగుతున్న వరుస పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదన్న వాదన క్రమంగా బలపడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ తో అంటకాగేందుకు టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారన్న వాదన కూడా ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. నిన్నటికి నిన్న రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన టీడీపీ... ఏకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈ మద్దతుతో కాంగ్రెస్ తో కలిసి సాగే విషయంలో తమకేమీ అభ్యంతరం లేదన్న భావనను చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు చాలా సైలెంట్‌గానే ఎక్కించేశారు.పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కాదనే దమ్మూ ధైర్యం ఇప్పుడు టీడీపీలో ఏ ఒక్కరికి లేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అరాచకాలకు చరమ గీతం పాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే... ఇప్పుడు చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం అదే పార్టీతో దోస్తీకి శ్రీకారం చుట్టేశారు. మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన టీడీపీ... ఏకంగా తన పార్టీ ప్రతినిధులను - తనకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘాల నేతలను కన్నడనాట దించేసి బాగానే ప్రచారం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీని ఓడించడమే లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశామని ఆ పార్టీ నేతలు చెప్పినా... అబ్బే అదేమీ లేదు అసలు తాము కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎక్కడ ప్రచారం చేశామో చెప్పాలంటూ టీడీపీ సీనియర్లు రివర్స్ గేర్ లోకి వచ్చేశారు. సరే ఇదంతా గతమే అనుకున్నా... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి అంటకాగేందుకు చంద్రబాబు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఈ దిశగా చంద్రబాబు స్పీడు పెంచేశారనే చెప్పాలి.

ఇందుకు నిదర్శనమా అన్నట్టుగా ఇప్పుడు చాలా అంశాలు మన కళ్లకు కనపడుతున్నాయి. లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగిన జరుగుతున్న ఉద్యమంలో భాగంగా టీడీపీకి మద్దతుగా నిలిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినా... అసలు విషయానికి వచ్చేసరికి ఏపీపై తమకేమీ అంతగా ఇంటరెస్ట్ ఏమీ లేదని తేల్చేసింది. ఇక ఈ రెండు పార్టీల మధ్య మైత్రి మరింతగా బలపడుతున్న విషయానికి వస్తే... ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత - చిత్తూరు ఎంపీ శివప్రసాద్... సినిమాల్లో తనకు అబ్బిన నటనతో బాగానే రంజింపజేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న వైనాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న శివప్రసాద్.. రోజుకో వేషంతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. తనకు గుర్తుకు వచ్చిన వేషాలన్నింటినీ వేసుకుని వస్తున్న శివప్రసాద్... ఈ రోజు థర్డ్ జెండర్ వేషంలో సభకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని బావా అంటూ సంబోధించిన శివప్రసాద్... రోజూ మాదిరే సభ ఎదుట మోదీపై తనదైన శైలిలో పద్యాలను - పదాలను బాగానే వినిపించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... టీడీపీ - కాంగ్రెస్ ల దోస్తీ బంధానికి నిదర్శనంగా నిలుస్తున్న మరో కీలక ఘటన ఆ తర్వాత చోటుచేసుకుంది.

థర్డ్ జెండర్ గా వేషం వేసుకున్న శివప్రసాద్‌తో కలిసి టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళుతున్న సమయంలో వారి వద్దకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ... శివప్రసాద్ థర్డ్ జెండర్ వేషాన్ని ఆకాశానికెత్తేశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ సర్కారుపై నిరసన ప్రదర్శనలు బాగానే నిర్వహిస్తున్నారని కితాబిచ్చిన సోనియా... శివప్రసాద్ థర్డ్ జెండర్ వేషాన్ని మెచ్చుకున్నారట. మొత్తంగా పార్లమెంటు ఆవరణలో పెద్దగా కనిపించని సోనియా... టీడీపీ ఎంపీల నిరసన ప్రదర్శనలను ప్రశంసించేందుకు మాత్రం సమయానికి అక్కడికి వచ్చినట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇదే తరహా ధోరణి ముందు ముందు మరింత బాగానే కనిపించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. అంటే... ఈ రెండు పార్టీల మధ్య మైత్రి నానాటికీ బలీయమవుతుండగా - ఇరు పార్టీల మైత్రికి సంబంధించి కేవలం బహిరంగ ప్రకటన మినహా మిగిలిన తతంగమంతా బాగానే నడుస్తున్నదన్న వాదన వినిపిస్తోంది.