Begin typing your search above and press return to search.

టీడీపీకి షాక్ - వైసీపీలోకి ఎంపీ ర‌వీంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   18 Feb 2019 5:52 AM GMT
టీడీపీకి షాక్ - వైసీపీలోకి ఎంపీ ర‌వీంద్ర‌బాబు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌వేళ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడికి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేర‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. సోమ‌వార‌మే ఆయ‌న జ‌గ‌న్ తో భేటీ అవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎంపీ ర‌వీంద్ర‌బాబు ప్ర‌తిష్ఠాత్మ‌క కోన‌సీమ రైల్వే లైనును సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. అయితే - ఈ విష‌యంలో త‌న‌కు త‌గినంత పేరు రాకుండా టీడీపీలో కొంద‌రు అడ్డుప‌డ్డార‌ని ర‌వీంద్ర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అమ‌లాపురం లోక్ స‌భ స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించే అంశంపై చంద్ర‌బాబు ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ట‌.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో చేరాల‌ని ర‌వీంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ర‌వీంద్ర త‌మ‌తో క‌ల‌వ‌బోతున్నార‌ని వైసీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి చాన్నాళ్లుగా చెబుతున్నారు. ర‌వీంద్ర మాత్రం ఇన్నాళ్లూ ఈ విష‌యంపై స్పందించ‌లేదు.

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని, వెంట‌నే పార్టీ మారాల‌ని ర‌వీంద్ర నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం జ‌గ‌న్ హైద‌రాబాద్ లో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న్ను క‌లిసేందుకు ఆదివారం సాయంత్ర‌మే ర‌వీంద్ర అమ‌లాపురం నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్ వ‌చ్చేశార‌ట‌. ఈరోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల త‌ర్వాత జ‌గ‌న్ తో ఆయ‌న భేటీ అవుతార‌ని.. ఆ వెంట‌నే వైసీపీలో చేరిక‌పై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.