చంద్రబాబు ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్సీ ఫైర్

Mon Nov 20 2017 16:00:55 GMT+0530 (IST)

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన సొంత పార్టీకే చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై - మంత్రుల తీరుపై విమర్శలు చేయడం విశేషం. ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడంలో తాత్సారం చేయడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ‘అన్న’ క్యాంటీన్లు ఇంతవరకూ ఏర్పాటు చేయకపోవడంపై ఆయన మంత్రులు తీరును తప్పుపట్టారు.
    
శాసనమండలిలో ఎమ్మెల్సీ మూర్తి మాట్లాడుతూ - ‘అన్న’ క్యాంటీన్ల విషయమై ఆరు నెలల క్రితం పరిటాల సునీత ఏం సమాధానం చెప్పారో.. ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అదే సమాధానం చెబుతున్నారని విమర్శించారు. ఆ శాఖకు మంత్రి మారినా - పథకం అమలు కావట్లేదని - ఆ క్యాంటీన్లను తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య - ఆరోగ్య శాఖ తీరు కూడా బాగాలేదని - డెంగీ - మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయని వాటి బారిన పడకుండా ప్రజలను కాపాడాలని ఆయన కోరారు.
    
కాగా... అన్న క్యాంటీన్లపై నిజంగానే ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. రూ.5కే భోజనం అందించే అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో పాపులర్ కావడంతో అదే తరహాలో ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికోసం మంత్రులు - అధికారులు గతంలో తమిళనాడు వెళ్లి పరిశీలించి వచ్చారు కూడా. అయినా ఈ క్యాంటీన్లను మాత్రం స్టార్ట్ చేయలేదు. మరోవైపు మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఒడిశా వంటి రాష్ర్టాలు ఈ కాన్సెప్టు గురించి తెలియగానే వెంటనే అమల్లోకి తెచ్చేశాయి. ఆయా రాష్ర్టాల్లో ఈ క్యాంటీన్లకు మంచి రెస్పాన్సు వస్తోంది కూడా. కానీ... ఏపీలో మాత్రం ఇంతవరకు ఈ పథకానికి అతీగతీ లేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ మూర్తి అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేశారు.