పచ్చబేరాలు షురూ: మంత్రుల చుట్టూ ఆశావహులు

Wed Apr 11 2018 12:49:30 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడనే మాట ఇప్పుడు పార్టీలో విపరీతంగా వినిపిస్తోంది. 17 సంస్థలకు నామినేటెడ్ పదవుల విషయంలో అధ్యక్షుల పేర్లను మాత్రం ప్రకటించి.. సభ్యుల పేర్లను ప్రకటించకపోవడం అనేది చాలా పెద్ద స్కెచ్ అని పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయా సంస్థల్లో సభ్యత్వాలను ఆశిస్తున్న వాళ్లంతా.. మంత్రులు చుట్టూ తమకు పరిచయం ఉన్న సీనియర్ నాయకుల చుట్టూ తిరగడం ప్రారంభం అయిపోయింది. అయితే.. నామినేటెడ్ పోస్టులు కోరుకుంటున్న వారికి టార్గెట్స్ నిర్ణయించి.. ఆ మేరకు అమాత్యులు బేరసారాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు పదవి తీసుకుంటారు.. సరే.. దానికి ప్రతిగా పార్టీకోసం మీరు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? పార్టీకోసం ఎంత వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అసలే ఎన్నికల సంవత్సరం.. మీరు పార్టీకోసం ఎంత చేయడానికి సిద్ధంగా ఉన్నారనే దానిన బట్టే ప్రస్తుతం.. నామినేటెడ్ సభ్యత్వాలు ఇవ్వడం కూడా జరుగుతుందని అమాత్యులు చెబుతున్నారుట.

ఒక రకంగా చూసినప్పుడు దాదాపుగా వేలం పాట నిర్వహిస్తున్నట్లుగా పరిస్థితి మారిపోతున్నదని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీ జెండా కర్ర పట్టుకుని.. దశాబ్దాలుగా మోస్తున్న వారికి నామినేటెడ్ పదవులు దక్కే సంస్కృతిపోయిందని.. తాజాగా.. పార్టీకి ఆర్థికంగా.. ఎన్నికల పరంగా ఆ సమయానికి తాము ఏం చేయగలం అనే హామీల మేరకే నామినేటెడ్ సభ్యత్వాలు కూడా దక్కే పరిస్థితి ఉన్నదని పార్టీలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.