Begin typing your search above and press return to search.

లండ‌న్ నుంచి జ‌గ‌న్ రావ‌ట‌మే త‌రువాయ‌ట‌!

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:50 AM GMT
లండ‌న్ నుంచి జ‌గ‌న్ రావ‌ట‌మే త‌రువాయ‌ట‌!
X
ఏపీ రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది. గ‌డిచిన రెండు వారాలుగా అధికార‌ప‌క్షం నుంచి విప‌క్షంలోకి జోరందుకున్న వ‌ల‌స‌లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కార‌ణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ ప‌ర్య‌ట‌నే. బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు త‌మ్ముళ్లు టైం కోసం ఎదురు చూశారు. అధికారం చేతిలో ఉన్న వేళ బాబుతో పెట్టుకోవ‌టం ఎందుక‌న్న‌ట్లుగా కామ్ గా ఉన్న నేత‌లు.. అధినేత‌పై త‌మ‌కున్న అసంతృప్తిని ప్ర‌ద‌ర్శిస్తూ.. ఒక్కొక్క‌రుగా పార్టీని వీడిపోతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జ‌గ‌న్ గూటికి వెళ్లే నేత‌ల జాబితా పెద్ద‌దే అని.. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగింది శాంపిల్ మాత్ర‌మేన‌న్న వాద‌న ప‌లువురి నోట వినిపిస్తోంది. జ‌గ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నార‌ని.. ఆయ‌న కానీ ఓకే అంటే గేట్లు ఎత్తేసిన‌ట్లేన‌న్న మాట వినిపిస్తోంది.

తొలిద‌శ‌లో పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన నేత‌ల తీరుతో బాబులో క‌ల‌వ‌రం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ లండ‌న్ ట్రిప్ కార‌ణంగా వ‌ల‌స‌ల‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డింద‌ని.. ఆయ‌న తిరిగి వ‌చ్చిన వెంట‌నే మ‌రింత‌మంది నేత‌లు జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేత‌ల్ని ఆప‌లేక కిందా మీదా ప‌డుతున్న బాబుకు.. జ‌గ‌న్ తిరిగి వ‌చ్చిన వెంట‌నే చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయ‌మ‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. అదే జ‌రిగితే.. ఎన్నిక‌ల‌కు ముందే బాబు తెల్ల ముఖం వేయ‌క త‌ప్ప‌ద‌న్న‌ట్లే.