జేసీ దివాకర్ రెడ్డి మాటలు.. బేకార్ ముచ్చట్లు!

Tue Apr 23 2019 11:31:19 GMT+0530 (IST)

జేసీ దివాకర్ రెడ్డి తీరుతో తెలుగుదేశం పార్టీ తల పట్టుకుంటోంది. జేసీ దివాకర్ రెడ్డిని డీల్ చేయడం అంటే.. అది కొరివితో తల గోక్కోవడమే అని తెలుగుదేశం పార్టీ వాళ్లు వాపోతూ ఉన్నారట. ఆయన వి అన్నీ బేకార్ ముచ్చట్లు అని వాటి వల్ల పార్టీకి నష్టం అని వారు అంటున్నారట.ఒక టీవీ చానల్ చర్చీ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం వాళ్లు ఇదే ఒపీనియన్ వ్యక్తం చేశారట. జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లతో తమకు సంబంధం లేదని.. ఆయన ఏమైనా మాట్లాడి ఉన్నా అది ఆయన వ్యక్తిగతం అని దానితో పార్టీకి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్లు టీవీ చానళ్లలో వివరణ ఇచ్చుకునే  ప్రయత్నం చేశారట.

తాము భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక్క ఎంపీ సీటు విషయంలోనే యాభై కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు పెట్టినట్టుగా రాష్ట్రమంతా అదే పరిస్థితి ఉన్నట్టుగా దివాకర్ రెడ్డి ప్రకటించుకున్నారు.

అన్ని రాజకీయ పార్టీలూ భారీగా డబ్బులు ఖర్చు పెట్టాయని అంటూనే.. తమ పార్టీ కూడా భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మాటలు సహజంగానే ప్రత్యర్థులతో పాటు అనేకమంది ప్రస్తావిస్తూ ఉన్నారు.

అందులోనూ 'పసుపు- కుంకుమ' పథకం కూడా ఓట్ల కొనుగోలుకే ఉపయోగపడిందని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా అంతా ప్రస్తావిస్తూ ఉన్నారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం అవుతున్నట్టుగా లేదు తెలుగుదేశం వాళ్లకు. అందుకే ఆయన మాటలతో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చేస్తున్నారు. ఆయనవి అన్నీ బేకార్ ముచ్చట్లు అని గొణుక్కొంటున్నారు.