Begin typing your search above and press return to search.

ఓడిన బాబు... అప్పుడే ప‌లుచ‌నయ్యారే!

By:  Tupaki Desk   |   12 Jun 2019 11:19 AM GMT
ఓడిన బాబు... అప్పుడే ప‌లుచ‌నయ్యారే!
X
తాజా ఎన్నిక‌ల్లో టీడీపీకి ద‌క్కిన ఘోర ప‌రాజ‌యం... ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును ప‌లుచ‌న చేసింద‌న్న వాద‌న అప్పుడే మొద‌లైపోయింది. ఇత‌ర పార్టీలకు చెందిన నేత‌ల‌ విష‌యంలో అయితే ఇలాంటి వాద‌న సాధార‌ణ‌మే అనుకున్నా... బాబు ఆదేశాలే శిర‌స్త్రాణంగా భావిస్తూ వ‌చ్చిన తెలుగు త‌మ్ముళ్ల విష‌యంలోనే బాబు ప‌లుచ‌నైపోయార‌న్న వాద‌న నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓట‌మి ద‌క్కి ఇంకా నెల కూడా గ‌డ‌వ‌లేదు... అప్పుడే తెలుగు త‌మ్ముళ్లు... బాబు ఆదేశాల‌ను అంత‌గా పట్టించుకోవ‌డం మానేశార‌ట‌. టీడీపీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత మేర ఓట‌మికి కార‌కుడైన బాబును ఇంకేం ప‌ట్టించుకుంటామ‌న్న రీతిలో కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే... మున్ముందు బాబు క‌నిపిస్తే అస‌లు ప‌ట్టించుకోక‌పోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న రీతిలో స‌రికొత్త విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడేం జ‌రిగింద‌ని బాబు ప‌లుచ‌న అయిపోయార‌ని చెబుతున్నారంటే... కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీలో పార్టీలో సీనియ‌ర్లుగా కొన‌సాగుతున్న ఇద్ద‌రు నేత‌ల వ్య‌వ‌హారం చూస్తే... బాబు ప‌లుచ‌న అయిన వైనం ఇట్టే అర్థం కాక మాన‌దు.

స‌రే మ‌రి... ఆ ఇద్ద‌రు తెలుగు త‌మ్ముళ్లు ఎవ‌రు? వారు ఏం చేసి బాబు ప‌లుచ‌న అయిపోయిన‌ట్లు చూపించార‌న్న విష‌యానికి వ‌స్తే.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పార్టీ అధినేత‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... చివ‌ర‌కు ఎంపీలు కూడా ప‌చ్చ చొక్కాలతోనే స‌భ‌కు హాజ‌రు కావాలి. ఇది ఇప్పుడే పెట్టిన నిబంధ‌న కాదు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ఈ సంస్కృతి కొన‌సాగుతోంది. ఎన్టీఆర్ గ‌తించినా... చంద్ర‌బాబు ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో నేడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో నిన్న జ‌రిగిన పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష భేటీలో... అంతా ప‌సుపు చొక్కాల్లోనే రావాల‌ని చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల్సిందేన‌ని, ఈ విష‌యాన్ని అంద‌రూ పాటించి తీరాల్సిందేన‌ని కూడా ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

బాబు ఆదేశాల‌క‌నుగుణంగా బాబుతో పాటు కొత్త స‌భ‌కు ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేల్లో బాబు, 20 మంది ఎమ్మెల్యేలు స‌భ‌కు ప‌చ్చ చొక్కాల‌తోనే వ‌చ్చారు. అయితే మిగిలిన ఇద్ద‌రు మాత్రం తెల్ల‌టి ఖ‌ద్ద‌రు చొక్కాల్లో స‌భ‌కు వ‌చ్చారు. వీరిద్ద‌రూ పార్టీకి కొత్త నేత‌లేమీ కాదు. స‌భ‌కు కూడా కొత్త నేత‌లేమీ కాదు. ఒక‌రు ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్టీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం కాగా... మ‌రొక‌రు అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొవండ నుంచి ఎన్నికైన మ‌రో సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్‌. పార్టీ స‌భ్యులంతా ప‌సుపు చొక్కాల్లోనే వ‌చ్చినా... వీరిద్ద‌రు మాత్రం త‌ళ‌త‌ళ మెరిసే తెల్ల‌టి చొక్కాలేసుకుని మ‌రీ వ‌చ్చారు. వ‌చ్చిన వారు ఓ మూల‌న కూర్చున్నారా? అధికార‌, విప‌క్ష స‌భ్యుల‌న్న తేడా లేకుండా క‌నిపించిన ప్ర‌తి స‌భ్యుడిని ప‌ల‌క‌రిస్తూ క‌లియ‌దిరిగారు. దీంతో వీరిద్ద‌రే నేటి స‌భ‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

బాబు ప‌చ్చ చొక్కాలేసుకుని రావాల‌ని ఆదేశాలు జారీ చేసినా... వీరిద్ద‌రు ఆ ఆదేశాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేదు. ప‌య్యావుల విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌పెడితే... పార్టీలో బాబు మాదిరి సీనియారిటీ క‌లిగిన క‌ర‌ణం మాత్రం కావాల‌నే తెలుపు రంగు చొక్కా వేసుకుకొచ్చిన‌ట్లుగా క‌నిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచే చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న బ‌ల‌రాం.. ఇప్పుడు కూడా పార్టీకి ఓట‌మి ద‌క్కేలా చేసిన బాబు మాట‌కు ఇంకేం విలువ ఇవ్వాల‌న్న‌ట్లుగా ప‌చ్చ చొక్కాకు బ‌దులుగా తెలుపు చొక్కా వేసుకొచ్చిన‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఎంత ఓడినా బాబు టీడీపీ అధినేతే కదా. అలాంటి బాబు ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ వీరిద్ద‌రూ పార్టీ సంప్ర‌దాయాన్ని తుంగ‌లో తొక్క‌డం నిజంగానే ఆసక్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.