Begin typing your search above and press return to search.

పచ్చపిచ్చోళ్ల పుచ్చు బుద్ధులివి!

By:  Tupaki Desk   |   21 July 2017 4:09 AM GMT
పచ్చపిచ్చోళ్ల పుచ్చు బుద్ధులివి!
X
కొందరు శాడిస్టులు - నేలబారు చీప్ బుద్ధులు గలవారు ఉంటారు. వారికి పుట్టే ఆలోచనలు కూడా చాలా చీప్ గానే ఉంటాయి. అసభ్య ఫోటోలను మార్ఫింగ్ చేసి.. తమకు కిట్టని వాళ్ల ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారానికి వదలడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. సాధారణంగా సినిమా పాత్రలు ఉండే ఫోటోలను మార్ఫింగ్ చేసి రాజకీయ నాయకుల తలకాయలు అమర్చి వాటి మీద జోకులు పేలుస్తూ.. సరదాగా చేసే మార్ఫింగ్ కార్టూన్లు అనేకం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అది మార్ఫింగ్ అని స్పష్టంగా తెలిసిపోయే విధంగా కేవలం సరదా కోసం మాత్రం చేసినట్లుగా ఉంటే గనుక.. అలాంటి విజువల్ సెటైర్లను అర్థం చేసుకోవచ్చు. కానీ.. అబద్ధాన్ని నిజం అని నమ్మించడం కోసం మార్ఫింగ్ చేయడమూ, దాని ద్వారా ఉద్దేశపూర్వకంగా ఇతరుల గౌరవానికి భంగం కలిగించాలని చూడడమూ మాత్రం దారుణం. దురద్దేశంతో కూడిన మార్ఫింగ్ ను సదా పరిహరించాల్సిందే.

పచ్చపార్టీ తెలుగుదేశం ప్రియులు ఆన్‌ లైన్ సోషల్ మీడియాలో వేసే ఇలాంటి వెర్రి మొర్రి వేషాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. వైసీపీ నాయకుల ఫోటోలతో టీడీపీ వారు కార్టూన్లు తయారుచేయడమూ, తెదేపా నాయకుల ఫోటోల వైకాపా అభిమానులు కార్టూన్లు తయారు చేయడమూ చాలా కాలంగా జరుగుతూ ఉన్నదే. కాకపోతే.. తాజాగా సాక్షిపత్రిక వెబ్‌ సైట్ ను కూడా మార్ఫింగ్ చేసి.. జగన్ ను భ్రష్టు పట్టించే విధమైన రాతలతో చాలా తెలివిగా, వెటకారాలను జోడించి సోషల్ మీడియాలోకి వదలడం తాజాగా జరుగుతోంది. నాయకుల మీద జోకులు కాదు... ఇవి పత్రిక `లాగానే భ్రమింపజేసే తప్పుడు వార్తలు!

సాక్షిపత్రిక వెబ్‌ సైట్ పేజీనే యథాతథంగా మార్ఫ్ చేసి అందులో వార్త మాత్రం తప్పుడు వార్త పెట్టి, యథాతథంగా అది సాక్షిలోనే వచ్చినట్లుగా భ్రమ కల్పిస్తూ.. పచ్చ దళాలు ప్రచారం చేస్తుండడం అసహ్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా పాఠకుల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసే ప్రయత్నమే తప్ప సరదా కోసం చేసింది కాదని అందరూ గుర్తిస్తున్నారు. ‘వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి చేయాల్సిందిగా తానే అమిత్ షాకు సూచించానంటూ, జగన్ చెప్పినట్లుగా... ఆ వార్త సాక్షి వెబ్ సైట్ లో వచ్చినట్లుగా ఓ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో చెలామణీ అవుతోంది.

సరదా కోసం చేసేదైతే.. నాయకుల తలల్ని మార్ఫింగ్ చేసి ఓ జోకుతో దానిని ముగిస్తారు. పత్రికల్లో కొన్ని దశాబ్దాలుగా చెలామణీలో ఉన్న పొలిటికల్ కార్టూన్లకు ఈ మార్ఫింగ్ జోకులు ఆధునిక ఆన్ లైన్ రూపాంతరం అనుకోవచ్చు. అయినా కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇలాంటివి పెడుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అయితే.. పత్రిక ఇమేజిని - పనిలో పనిగా జగన్ ఇమేజిని దెబ్బతీస్తూ.. పనిగట్టుకుని మోసం చేసేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టే పచ్చబుద్ధుల్ని ఏమనాలి? పోలీసులు అలాంటి వారి పట్ల ఏం చర్యలు తీసుకుంటారు? చూడాలి!!