Begin typing your search above and press return to search.

పార్టీకి ప‌ట్టిన శ‌ని పోయింద‌ని త‌మ్ముళ్ల పండ‌గ‌?

By:  Tupaki Desk   |   22 Jun 2019 6:54 AM GMT
పార్టీకి ప‌ట్టిన శ‌ని పోయింద‌ని త‌మ్ముళ్ల పండ‌గ‌?
X
ఫిరాయింపులు ఏ పార్టీకైనా షాకిస్తాయి. కానీ.. నలుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీ నుంచి వీడిపోయిన వైనం రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మైంది. అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో మాత్రం పండుగ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. పార్టీకి పట్టిన శ‌ని వ‌దిలింద‌ని.. వారి కార‌ణంగానే బాబు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా ప‌లువురు చోటా నేత‌ల నోటి నుంచి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

టీజీ వెంక‌టేశ్ .. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే ర‌క‌మ‌ని.. సీఎం ర‌మేశ్‌.. సుజ‌నాల‌కు ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఆద‌ర‌ణ లేద‌ని.. స‌ర్పంచ్ గా కూడా వారు గెల‌వ‌లేర‌ని.. ఇలాంటి నేత‌లు ఉన్నా.. లేకున్నా ఒక్క‌టేన‌న్న మాట వినిపిస్తోంది. టీడీపీ కొంద‌రి క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకుపోయింద‌ని.. వారి ట్రాప్ లో ప‌డిన బాబు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని.. తాజా ఉదంతం బాబు క‌ళ్లు తెరిపిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

సాధార‌ణంగా నేత‌లు ఎవ‌రైనా వెళ్లిపోతే బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లుగా భావిస్తారు. కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్నంగా వారి పోక‌.. పార్టీకి లాభం చేకూరుస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎలాంటి ప్ర‌జాద‌ర‌ణ లేని వ్య‌క్తులు.. అధినేత అండ‌తో చెల‌రేగిపోయిన కార‌ణంగా పార్టీకి ఎంతో న‌ష్టం వాటిల్లింద‌ని.. .శ‌ని లాంటి నేత‌లు పోవ‌టంతో లాభ‌మే త‌ప్పించి న‌ష్ట‌మే ఉండ‌దంటున్నారు. వీరే కాదు.. ఇలాంటి బ్యాచ్ మ‌రికొంద‌రు ఉన్నార‌ని.. వారు కూడా పోతే ద‌రిద్రం పోతుంద‌న్న మాట వినిపించ‌టం విశేషం. మ‌రి.. ఈ ఫ్యీడ్ బ్యాక్ బాబు దృష్టికి వెళ్లిందా? ఇంత‌కాలం తాను ఎలాంటి వారిని ద‌గ్గ‌ర‌కు తీశాన‌న్న విష‌యం వారికి అర్థ‌మైందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.