Begin typing your search above and press return to search.

జగన్ పై తెదేపాకు క్లారిటీ ఉందా ? లేదా ?

By:  Tupaki Desk   |   6 Oct 2015 10:30 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం తీరు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు తయారవుతోంది. జగన్ పై అధికార పక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని అధిక్యతతో అధికారం చేజిక్కుంచుకున్న తెలుగుదేశం పార్టీ ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రలు తప్ప వేరే ఏ ఇతర గుర్తింపుకూ నోచుకోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ విమర్శలను తిప్పికొట్టడంలోనూ విఫలమవ్వడం చాలా దారుణంగా వుందని పలువురు నేతలు వాపోతున్నారు.

భోగాపురంలో ప్రతిపక్షనేత జగన్ ఆందోళన సందర్భంగా అధికారపక్ష నేతల విమర్శలు గాడి తప్పుతున్నట్లు బహిరంగంగానే తెలుస్తోంది. పెద్దవాళ్ళ భూములను వదిలి పేదవాళ్ళ భూములపై పడ్డారని అధికార తెదేపాపై ప్రతిపక్షనేత జగన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే దీనిని తిప్పికొట్టడంలో తెదేపా నాయకులు కాస్త అత్యుత్సాహం చూపారని చెప్పుకోక తప్పదు. విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన 5,311 ఎకరాల భూమిలో 80 శాతం జగన్ కు చెందిన బినామీలవనీ, ఒక్క వాన్ పిక్ కోసం వేల ఎకరాల భూమిని వై ఎస్ హయాంలో జగన్ మంజూరు చేయించారని, ప్రస్తుతం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్ అడ్డుకొంటున్నారని కళా వెంకటరావు విమర్శించిన కాసేపటికే అధికార పక్ష గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని విమర్శిస్తూ జగన్ రాజకీయ లబ్ది కోసం మాత్రమే ఈ ఆందోళన చేపట్టారనడం పలు విమర్శలకు తావిస్తోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు ప్రతిపక్షనేతను విమర్శించడంలో భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చకుండా ఒకే మాటపై వుంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరేమో.. జగన్ సొంత మనుషుల యొక్క భూముల కోసం గొడవ చేస్తున్నారని , బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నారని అంటున్నారు. మరొకరేమో రాజకీయ లాభం కోసం అంటున్నారు.. ఇది చూసి అసలు తెలుగుదేశం పార్టీకే ఒక స్పష్టత లేదేమో అని పలువురు నవ్వుకుంటున్నారు.

ఇకమీదటైనా విమర్శల సంగతి ఏమో గానీ, కనీసం విమర్శలను తిప్పికొట్టడంలోనైనా కాస్త సంయమనం పాటిస్తే బాగుంటుందనిపిస్తూంది.