Begin typing your search above and press return to search.

బాబును ప‌వ‌న్ ఇరికించాడంటున్న త‌మ్ముళ్లు

By:  Tupaki Desk   |   21 Feb 2018 6:34 AM GMT
బాబును ప‌వ‌న్ ఇరికించాడంటున్న త‌మ్ముళ్లు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుత రాజ‌కీయ డైలమా స్థితిపై ఆ పార్టీ నేత‌ల్లోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీకి అండ‌దండ‌గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఇటు పార్టీని అటు నాయ‌కుడైన చంద్ర‌బాబును చిక్కుల్లో ప‌డేశార‌ని అంటున్నారు. ఇదంతా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌న‌సేన పార్టీ ర‌థసార‌థి దూకుడు గురించి అవిశ్వాసం గురించి ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న దానికి జ‌గ‌న్ టీం స్పంద‌న - అది రాజ‌కీయాల్లో సృష్టించిన క‌ల‌క‌లం గురించి తాజా చ‌ర్చ‌.

గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతిస్తూ విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన అధినేత వపన్ కల్యాణ్ ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టడానికి కీలకమైన పాత్రే పోషించారు. దీనిని చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త సమస్యల్లో ఇరుకున్నప్పుడు పవన్ ఏదో సభ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసి చర్చమొత్తం దారిమళ్లిస్తారనే రాజకీయ విమర్శలున్నాయి. చంద్రబాబుకు కష్టాలు వచ్చినప్పుడల్లా వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పవన్ జనంలోకి వస్తారనే ప్రతిపక్షాల ఆరోపణలు లేకపోలేదు. అయితే ఇంత కాలం చంద్రబాబును కాపాడుతూ వచ్చిన జనసేనాని తాజాగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప‌వ‌న్ స్పంద‌న ఇలా ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలతో రాజీనామా చేయించాలని నిర్ణయించింది. అయితే ఎంపీలు రాజీనామా చేయడం కాదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జగన్ `మాకు అవిశ్వాసం పెట్టాల్సినంత బలం లేదు అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధం అయితే పవన్ తన భాగ‌స్వామి చంద్రబాబును ఒప్పించడానికి సిద్ధమేనా?` అని ప్రశ్నించారు. దీనిపై మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ తాను జగన్ సవాల్‌ ను స్వీకరిస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. `ఒక్క ఎంపీ ఉన్నా అవిశ్వాసం పెట్టొచ్చు.మీరు అవిశ్వాసం పెట్టండి. ఢిల్లీ - అవసరమైతే అన్ని రాష్ట్రాలు తిరిగి - అన్ని పార్టీలను కలిసి నేను మద్దతు కూడగడతా. జగన్ దమ్మున్న నేత. ధైర్యంగా పోరాడాలి. నీ వెనుక నేనుంటాను`అని మీరు అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ రంగు బయటపడుతుందని వ్యాఖ్యానించారు.

దీంతో బాబు డిఫెన్స్‌ లో ప‌డిపోయార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రెండు భిన్న‌మైన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న చేశార‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా కీల‌క‌మైన రాజ‌కీయ అడుగు వేసిన జ‌గ‌న్‌...త‌న ఎత్తుగ‌డ‌లో భాగంగా ప‌వ‌న్‌ కు స‌వాల్ విసిరార‌ని అయితే..దాన్నిఊహించ‌ని ప‌వ‌న్ త‌మ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసేలా స్పందించార‌ని అంటున్నారు.