Begin typing your search above and press return to search.

గరివింద నీతిని మర్చిపోతే ఎలా తమ్ముళ్లు?

By:  Tupaki Desk   |   27 May 2016 4:50 AM GMT
గరివింద నీతిని మర్చిపోతే ఎలా తమ్ముళ్లు?
X
ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు తమలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మాటల దాడి మామూలే. అయితే.. అవసరం ఉన్నా లేకున్నా.. రాజకీయ ప్రయోజనం కలుగుతుందా? లేదా? అన్న విషయాల్ని వదిలేసి.. ప్రతిదానికి రియాక్ట్ కావటం అంత బాగోదు. తాజాగా జగన్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా జగన్ కు ఆడిటర్.. ఆయనకు అత్యంత క్లోజ్ అయిన విజయసాయిరెడ్డిని ఎంపిక చేయటం తెలిసిందే.

ఇప్పుడున్నపరిస్థితుల్లో కీలకమైన రాజ్యసభ సభ్యత్వాన్ని ఎవరికి కట్టబెట్టాలన్న విషయం మీద జగన్ కు చాలానే ఇబ్బందులు ఉన్నాయి. అందుకే.. ఎవరూ ప్రశ్నించటానికి వీల్లేని విధంగా విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఓకే చేసేశారు. తన తాజా నిర్ణయంతో విశ్వాసపాత్రులకు.. విధేయులకు పదవులు పక్కా అన్న విషయాన్నిజగన్ చెప్పేశారు. అయితే.. ఈ వ్యవహారం మీద తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆర్థిక నేరస్తుడైన విజయసాయి రెడ్డిని రాజ్యసభకు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోకుండా ఉండాలని జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తున్నారు.

విజయసాయి రెడ్డి మీద ఆరోపణల్ని ఎవరూ ఖండించలేరు. ఆయనపై నమోదైన కేసుల్ని ఎవరూ కాదనలేరు కూడా. అలా అని కేసులున్నాయి కాబట్టి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయకూడదంటూ తమ్ముళ్లు వాదించటంలోనే అసలు అభ్యంతరమంతా. ఒకవేళ తమ్ముళ్లు చెప్పే మాటల్నే పరిగణలోకి తీసుకుంటే సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవిని చంద్రబాబు ఇప్పించకూడదు. ఆ మాటకు వస్తే.. నోటుకు ఓటు కేసులో వీడియోల సాక్షిగా అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డి మాటేమిటి? లాంటి ప్రశ్నలకు తెలుగు తమ్ముళ్లు సంతృప్తికర సమాధానాలు చెప్పగలరా? అన్నది ప్రశ్న. ఇలాంటి వాదనను సగటు సీమాంధ్రుడు చేసే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సుద్దపూసల మాదిరిగా ఉండి ఉంటే.. ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎంతోకొంత సమంజసంగా ఉంటుంది. అందుకు భిన్నంగా గురివిందలా మాట్లాడితేనే తిప్పలంతా. మరి.. ఇలాంటి చిన్న విషయాల్ని తమ్ముళ్లు ఎందుకు పట్టించుకోరు..?