బెజవాడలో టీడీపీ జనసేనల ఫ్లెక్సీల గోల!

Wed Nov 07 2018 16:45:29 GMT+0530 (IST)

మరి కొద్ది నెలల్లో రాబోతోన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు ..ఒకరిపై ఒకరు ఆరోపణలు...ప్రత్యారోపణలతో కాకపుట్టిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ను ఎద్దేవా చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబును విమర్శిస్తూ....పవన్ కు అనుకూలంగా జనసేన నేత రాజేష్ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడలో ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.రెండు రోజుల క్రితం .....పవన్ ను విమర్శిస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ``అన్నదమ్ములు కలిసి ప్రజారాజ్యం పేరుతో పోటీ చేసినా 18 సీట్లే వచ్చాయనీ ఇప్పుడు కొత్తగా ప్రగల్భాలు పలకడం మానుకోవాలని...1-2 అసెంబ్లీ సీట్లకు మించి గెలిచే సీను సత్తా జనసేనకు లేవని ఎద్దేవా చేస్తూ ఆ ఫ్లెక్సీలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. దానికి కౌంటర్ గా జనసేన నేతలు కొత్త పోస్టర్లు ప్లెక్సీలను అంటించారు. గుప్పించారు. ‘పిచ్చి ముదిరిన పచ్చకాలం.. ఏం తమ్ముళ్లూ.. వేధిస్తోందా ఓటమి భయం? గుర్తుకు వస్తోందా పదేళ్ల ప్రతిపక్ష కాలం. 2009లో విజయవాడలో జీరోగా ఉన్న మీరు 2014కల్లా హీరోగా ఎలా మారారు?..విజయవాడలో విజయం సాధించడం మీ నాయకుడి తంత్ర ఫలమా? లేక మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? తెలుగు తమ్ముళ్లకు గోదావరిలో కౌంట్ డౌన్ మొదలయింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పకుంటే తాము జనసైనికులమే కాదు `` అని జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.