భలే మంచి బేరం.. కూకట్ పల్లి యమ కాస్ట్

Thu Dec 06 2018 14:56:00 GMT+0530 (IST)

తింటే గారలే తినాలి.. వింటే భారతం వినాలి.. ఓటేస్తే కూకట్ పల్లిలోనే వేయాలి.. అన్న చందంగా మారింది కూకట్ పల్లి పోలింగ్ . ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నికంటే ఎక్కువ గా ఓటుకు డిమాండ్ కూకట్ పల్లిలోనే పలుకుతుందోట. క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం మేరకు టీడీపీ ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయలకు పై గానే ఖర్చు పెడుతోందట..కూకట్ పల్లి స్థానం టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహసినిని ఏరికోరి చంద్రబాబు నిలబెట్టారు. ఆమె ఓడిపోతే  టీడీపీ పరువు పోతుంది. చంద్రబాబు నాయుడికి తెలంగాణ లో తిరిగేందుకు కూడా మొఖం చెల్లకుండా పోతుంది. అందుకే ఇక్కడ టీడీపీ నేతలు సర్వశక్తులు ఒడ్డి గెలుపే కోసం పోరాడుతున్నారు. పరువు ముందు డబ్బు ఒక లెక్క అన్నట్టు టీడీపీ నేతలు డబ్బులను మంచి నీళ్ల లా ఇక్కడ ఖర్చు చేస్తున్నారు.

నోట్ల పంపిణీ విషయంలో ఇప్పటి వరకు ఆంధ్రా ఏరియాల్లోనే ఎక్కువగా జరిగేవీ. ఈసారి తెలంగాణలోనూ నోట్ల పంపిణీ ఏరులై పారుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పట్టుబడిన కోట్ల రూపాయల డబ్బును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కేవలం ఓట్ల కోసం 5నుంచి 10కోట్ల రూపాయాలను పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. ఇక ప్రచారంలో జనాలను తిప్పుకోవడానికి కార్యకర్తలను మెయింటేన్ చేయడానికి ఖర్చులు వేరేగా ఉన్నాయి.

ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల ఎక్కడా ఖర్చుకు పార్టీలు వెనుకడటం లేదు. గెలిచిన తర్వాత రాబట్టుకోవచ్చులే అనేలా విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. హేమా హేమీలుండడంతో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో అత్యంత కాస్ట్ లీ నియోజకవర్గంగా కూకట్ పల్లి నిలుస్తోంది.

ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో తెలుగుదేశం అనుకూల సామాజకవర్గం నేతలు కూకట్ పల్లిలో దిగిపోయారు. ఆ నేతలు బస చేసిన చోటల్లా భారీగా నగదు దొరుకుతున్నాయి. తాజాగా కూకట్ పల్లిలో పంచడానికి టీడీపీ నేత జూపూడీ ప్రభాకర్ రావు ఇంటినుంచి తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడి కలకలం రేపాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కూకట్ పల్లి లో ఒక్కో ఓటును టీడీపీ రూ.5వేలకు ఒకటి చొప్పున కొంటోందట.. ఆరుగురున్న ఫ్యామిలీ కి ఏకంగా 30వేల రూపాయలను ఇస్తున్నట్టు వార్తలు లీక్ అవుతున్నాయి. ఇలా టీడీపీ కోట్ల ముందు టీఆర్ఎస్ డబ్బు విషయంలో ఏమాత్రం అందుకోలేకపోతోందట.. కానీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు  టీఆర్ఎస్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ నోట్ల విషయంలో టీడీపీ అభ్యర్థిని ఢీకొట్టలేక పోతున్నట్టు సమాచారం.