మహిళతో గిడ్డి ఈశ్వరి గొడవ..వైరల్ వీడియో!

Mon Jul 16 2018 14:38:08 GMT+0530 (IST)

ఆమె సాక్ష్యాత్తు ఎమ్మెల్యే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీలో చేరిన గిడ్డి ఈశ్వరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒక మహిళతో గొడవ పడుతూ.. వారిరువురి మధ్య వాగ్వాదంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు.. మరో మహిళ కింద పడిపోయారు. అనంతరం లేచిన ఆ మహిళతో నువ్వు నన్ను కొట్టకు.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం సదరు వీడియోలో ఉంది.అయితే.. వీడియోలో ఉన్న మహిళ ఏమీ అనకపోవటం.. గిడ్డి ఈశ్వరి.. ఆమెను నెట్టుకుంటూ వెళ్లటం ఉంది. 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. మరో సన్నివేశం కూడా ఉంది. మహిళతో గొడవ పడుతున్న సమయంలో ఒక యువకుడు రావటం.. అతన్ని ఉద్దేశించి ఆమె ఆవేశంతో.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. రాజకీయాలు చేస్తే పాతేస్తా.. ఇది నీకు సంబంధం లేని విషయం అంటూ మండిపడటం కనిపించింది. నువ్వే చేశావ్ వెధవ రాజకీయాలు అన్నీ అంటూ ఆమె హెచ్చరించారు.

ఇంతకీ  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గొడవ పడింది ఎవరితో?  ఎందుకు? అన్న విషయంపై  పలువురు చెబుతున్న అంశాల్ని చూస్తే.. ఈశ్వరి గొడవ పడిన మహిళ ఆమె సొంత వదిన అని.. అన్న కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు దౌర్జాన్యానికి దిగినట్లుగా ఆరోపిస్తున్నారు. అధికారం ఉందన్న అండతో సోదరుడి పిల్లలను బలవంతంగా గెంటివేసినట్లుగా చెబుతున్నారు. మరో వాదన ఏమంటే.. ఈశ్వరికి వరసకు వదిన అయిన విజయలక్ష్మితో భూవివాదం ఉన్నట్లు తెలుస్తోంది.

గిడ్డి ఈశ్వరి స్వగ్రామమైన కుమ్మరిపుట్టులో తన వదిన వద్ద రూ.2లక్షలకు భూమి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారని.. ధాన్యం నిల్వల కోసం గదిని నిర్మించే క్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరి.. ఆమె వదిన విజయలక్ష్మిల మధ్య వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కింద పడిపోయారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే..ఈ వీడియో వైరల్ కావటంపై గిడ్డి ఈశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కుటుంబ వ్యవహారమని.. ఇలా సోషల్ మీడియాలో రావటం సరికాదన్నారు.