Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: అదును చూసి బాబును కొట్టిన బీజేపీ

By:  Tupaki Desk   |   20 Jun 2019 9:52 AM GMT
బిగ్ బ్రేకింగ్: అదును చూసి బాబును కొట్టిన బీజేపీ
X
కేంద్రంలో అఖండ మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు తమ శత్రువులను టార్గెట్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం చేసిన చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా కేంద్రంలో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పటికే ఆపరేషన్ టీడీపీని చేపట్టిన బీజేపీకి ఇప్పుడు ఫలితం వచ్చింది.

సరిగ్గా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీలోని నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పెద్ద అమిత్ షా - ప్రధాని మోడీని కలిసి టీడీపీని వీడి బీజేపీ అనుబంధ సభ్యులుగా చేరుతామని చర్చలు జరిపి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి కోరడం తాజాగా సంచలనంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలబడ్డ సన్నిహిత పారిశ్రామికవేత్తలు - టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి - సీఎం రమేష్ లతోపాటు మరో ఇద్దరు ఎంపీలు గరికపాటి రామ్మోహన్ - టీజీ వెంకటేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. వీరు తాజాగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారని సమాచారం. బీజేపీతో అనుబంధంగా రాజ్యసభలో ఉండేందుకు వీరు ఒక అంగీకారపత్రాన్ని ఇవ్వగా మోడీషాలు ఒకే చెప్పినట్టు సమాచారం.

ఇక టీడీపీలో మిగిలిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలైన తోట సీతారామలక్ష్మీ - టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ తోనూ బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు భోగట్టా. సీతారామలక్ష్మీ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. కనకమేడల మాత్రం టీడీపీని వీడే ఆలోచనలో లేనట్టు తెలిసింది.

తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరే నాలుగు రాజ్యసభ ఎంపీల బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారని తెలుస్తోంది. వీరి చేరికతో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు..

కాగా ఏపీలోనూ టీడీపీలో ముసలం మొదలైంది. ఏపీ కాపు నేతలు.. మాజీ ఎమ్మెల్యేలు తాజాగా కాకినాడలో సమావేశమయ్యారు. తోట త్రిముర్తులు ఆధ్వర్వంలో వీరు సమావేశమై టీడీపీని వీడి బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం. చెంగల్ రాయుడు - ఈలినాని - జ్యోతుల నెహ్రూ - మాధవ నాయుడు - వంగాల గీత - కాపు నేతలు - బోండా ఉమ - బడేటి బుజ్జి - వరుపుల రాజా - తదితర మాజీ ఎమ్మెల్యేలు భేటి అయ్యారు. వీరంతా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

దీంతో ఆపరేషన్ టీడీపీ మొదలైనట్టే కనిపిస్తోంది. చంద్రబాబు ను - ఆయన పార్టీని దెబ్బతీసి బలపడేందుకు బీజేపీ ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. అందుకే మాజీ ఎమ్మెల్యేలు - కాపు నేతలకు గురిపెట్టినట్టు అర్థమవుతోంది. మరి విదేశాల్లో ఉన్న బాబుకు ఇది పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.