మహిళా ఇంజినీరుపై తెలుగు తమ్ముడి వీరంగం!

Wed Sep 13 2017 13:41:56 GMT+0530 (IST)

అధికారం తలకెక్కి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో మూల వీరి ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు - మహిళలు - సామాన్యులనే బేధాల్లేకుండా  అన్ని వర్గాలపై సమన్యాయంతో తమ దౌర్జన్యకాండను కొనసాగిస్తూనే ఉన్నారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు - అసభ్య ప్రవర్తన గతంలో కొన్ని సంఘటనల ద్వారా బయటపడింది. తాజాగా చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఓ మహిళా ఉద్యోగిని టీడీపీ నాయకుడు బూతుల తిడుతూ రెచ్చిపోవడం కలకలం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త దళిత వర్గానికి చెందిన ఓ మహిళా ఇంజనీరును పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడటాన్ని చూసి అక్కడి ఉద్యోగులు - ఇతర కాంట్రాక్టర్లు నివ్వెరపోయారు.
 
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకట్రామిరెడ్డితో పాటు సహాయ ఇంజనీరు - ఆరుగురు ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. హఠాత్తుగా అక్కడకు వచ్చిన టీడీపీ మహిళా కార్పొరేటర్ లలిత భర్త యువరాజులనాయుడు నేరుగా దళిత వర్గానికి చెందిన మహిళా సహాయ ఇంజనీరు వద్దకు వెళ్లి... ‘‘ఏమే నీకోసం ఎంతసేపు కూర్చోవాలి? సైట్ లో వర్క్ కొలతలు తీస్తామని ఇక్కడ కూర్చుని కథలు చెప్పుకుంటా ఉండావా? నీ.. పోయే బయటకు. ఇంకోసారి నాకు తెలియకుండా సైట్ లోకి వస్తే కాళ్లు నరికేస్తా. ఏమే మేమంటే నీకు లెక్కలేదా?’’ అంటూ దూషణలకు దిగాడు. ఓ దశలో ఇంజనీరుపై కుర్చీతో దాడి చేయడానికి కూడా ప్రయత్నించటంతో మరో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆయన్ను అడ్డుకుని బయటకు తరలించారు. అందరి ముందు నానా దుర్భాషలాడటంతో దళిత మహిళా ఇంజనీరు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారం మొత్తం కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.
 
చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో అమృత్ పథకం కింద ఉద్యానవన పనులు దక్కించుకున్న టీడీపీ మహిళా కార్పొరేటర్ భర్త.. బిల్లు తయారు చేయాల్సిందిగా మహిళా ఇంజనీరుకు పురమాయించాడు. అయితే అప్పటికే కమిషనర్ అప్పగించిన పనుల్లో ఉండటం మేయర్ మరో ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పడంతో ఆమె అందులో నిమగ్నమయ్యారు. దీన్ని పట్టించుకోని కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. ఇంత జరుగుతున్నా ఆయనను మందలించడంకానీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కానీ ఉన్నతాధికారులు ముందుకురా లేదు. ఓ అధికారి సెలవు పెట్టి వెళ్లిపోమని సూచిస్తే మరో అధికారి ధర్నా చేయమ్మా.. అంటూ సలహా ఇచ్చి వెళ్లిపోయారు.