తెలంగాణ టీడీపీ పూర్తిగా హ్యాండ్సప్!

Sun Mar 24 2019 18:46:19 GMT+0530 (IST)

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మహాకూటమితో వెళ్లి అధికారాన్ని సొంతం చేసుకోవడానికి వ్యూహం రచించిన టీడీపీకి తెలంగాణ ఓటరు గట్టి ఝలక్ ఇచ్చాడు. కూటమిగా వెళ్లినా తెలుగుదేశం పార్టీ పరువు నిలుపుకోలేకపోయింది.కంచుకోటలు అనుకున్న  నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది. ఏదో నామమాత్రంగా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లలో విజయం సాధించింది. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అయినట్టే. వారు తెలుగుదేశం కార్యకలాపాల్లో పాలుపంచుకునే అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనకపోవడమే మేలని తెలుగుదేశం పార్టీ భావించినట్టుగా ఉంది.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కూడా తెలంగాణ తెలుగుదేశం నేతలు నిర్ణయించేశారట. పోటీ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు.  ఇటీవల ఒక సమీక్షను అయితే నిర్వహించారు. ఆ సమీక్షకు హాజరై వచ్చిన వెంటనే.. నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిపోయి ఆ పార్టీ తరఫు నుంచి ఖమ్మం టికెట్ ను ఖరారు చేసుకున్నారు.

ఇక ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఓటమితో మిగతా నేతలు కూడా ఉత్సాహంతో లేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళ్లే ఆలోచన చేసినా.. వీరితో పొత్తుకు కాంగ్రెస్ సై అనే సూచనతలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వెళ్లడం వల్లనే తమకు ఓటమి ఎదురైందనే భావనలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆ పార్టీ కూడా సాహసించకపోవచ్చు.

ఈ నేపథ్యంలో చేతులు ఎత్తేయడానికి మించిన మంచి పని మరోటి లేదనే భావనతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరం కాంగ్రెస్ కు మద్దతు అనే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తెలంగాణలో టీడీపీ పతనం పూర్తి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.