Begin typing your search above and press return to search.

టీడీపీ అధ్య‌క్షుడిగా కేఈ.. సీనియ‌ర్ల బ్రేకులు

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:49 AM GMT
టీడీపీ అధ్య‌క్షుడిగా కేఈ.. సీనియ‌ర్ల బ్రేకులు
X
దాదాపు ఐదు నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి, సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న జాతీయ కమిటీతో పాటు తెలుగు రాష్ట్రాల కమిటీలను, పొలిట్ బ్యూరోను ఖ‌రారు చేసేందుకు ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. జాతీయ క‌మిటీ, తెలుగు రాష్ట్రాల కమిటీతో పాటు పొలిట్ బ్యూరో కూర్పుపై పార్టీ సీనియర్లతో ఇప్ప‌టికే చర్చించారు. ఆయా సామాజికవర్గాలను, తెలుగు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని పొలిట్ బ్యూరో సభ్యులను ఎంపికచేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి పేరు బ‌లంగా వినిపిస్తున్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల్ల అది ఓకే కాక‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

ఏపీ తెదేపా అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవిలో మరొకరిని నియమించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. తొలుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప పేరు ప్రచారంలోకి వచ్చినా ఆయన ఇప్పటికే హోంమంత్రిగా ఉన్నారని ఈ పదవి నుంచి తప్పించి పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడితే ప్రజల్లోకి తప్పడు సంకేతాలు వెళతాయని భావించినట్టు సమాచారం. కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్న చంద్రబాబు అంత‌కు కొద్దిముందు పార్టీ నేత‌ల‌తో కమిటీలను ప్రకటించే అంశంపై చ‌ర్చించారు. అయితే ఈ సంద‌ర్భంగా కేఈని ఎంపిక చేసే ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. కానీ దీనితో ప‌లువురు విబేధించినట్లు, దానికి బాబు సైతం స‌మ్మ‌తించిన‌ట్లు తెలుస్తోంది.

పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నకేఈ కృష్ణమూర్తి కూడా ఇదే ప్రాంతానికి చెందినవారు అవుతార‌ని కొంద‌రు నేతలు అభ్యంత‌రం చెప్పారు. సీమ‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని, ప్ర‌స్తుత కాలంలో సీమ కంటే కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీట వేయ‌డం వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఏపీ అధ్యక్షుడిగా కోస్తాంధ్ర నుంచి ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన వారిని రాష్ట అధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ప్రతిపాదించారు. దీంతో...మ‌రోమారు పార్టీకి చెందిన సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించివారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే పార్టీ అధ్యక్షపదవిపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.